Voter ID-Aadhaar linkage: ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానం దిశగా కీలక ముందడుగు
Voter ID-Aadhaar linkage: ఓటర్ ఐడీ-ఆధార్ అనుసంధానం దిశగా కీలక ముందడుగు పడింది. అనుసంధానానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘం త్వరలో కేంద్ర ప్రభుత్వంతో చర్చించనుంది.
Voter ID-Aadhaar linkage: ఓటరు ఫోటో గుర్తింపు కార్డు (EPIC)కు సంబంధించి లోటుపాట్లను, నకిలీ ఓటర్ కార్డులను తొలగించడానికి ఓటరు ఐడీలను ఆధార్ తో అనుసంధానం చేయాలన్న ప్రతిపాదనపై ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ మంగళవారం ఉన్నత స్థాయి చర్చ నిర్వహించనున్నారు.
కేంద్ర ప్రభుత్వంతో చర్చలు
హోం, న్యాయ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, యుఐడిఎఐ ముఖ్య కార్యనిర్వహణాధికారితో కలిసి ఒక ఓటరుకు ఒకటికి మించి ఓటరు ఐడీ కార్డులు ఉండడానికి సంబంధించిన సమస్యను ఆ ఉన్నత స్థాయి సమావేశంలో చర్చించనున్నారని పేరు చెప్పడానికి ఇష్టపడని అధికారులు తెలిపారు. ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు అర్హులైన వారందరికీ 100 శాతం కవరేజీ కల్పించడమే ఈ సమావేశం ముఖ్యోద్దేశం. ఓటింగ్ శాతం పెంచడం, బహుళ ఎపిక్ లను తొలగించడం వంటి కీలక అంశాలపై సీఈసీ ఈ సమావేశంలో చర్చించనుంది. 99 కోట్ల మంది ఓటర్లలో మూడింట రెండొంతుల మందికి ఇప్పటికే ఆధార్ ఉన్నందున ‘ఆధార్ - ఓటర్ ఐడీ’ ప్రక్రియపై చర్చించనున్నారు. అయితే, ఎపిక్ డేటాబేస్ తో తాము సీడ్ చేయనందున, అందుకు సంబంధించిన విధివిధానాలపై కూడా చర్చిస్తామని వారు తెలిపారు.
అనుసంధానం తప్పనిసరి చేస్తారా?
అయితే, ఆధార్ అనుసంధానం తప్పనిసరి కాదన్న ఈసీఐ గత వైఖరికి ఈ పరిణామాలు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ చట్టబద్ధత 2022 లో నోటిఫై చేసిన ఎన్నికల చట్టాల (సవరణ) చట్టం, 2021 నుండి ఉద్భవించింది. దీనిలో ఆధార్ ను ప్రధాన గుర్తింపు కార్డుగా నిర్ధారించారు. ఆధార్ అనుసంధానం చేసుకోకపోతే, ఎలాంటి చర్యలు తీసుకోవాలని సవరణలో పేర్కొననప్పటికీ, అనుసంధానం అమలును సమర్థవంతంగా తప్పనిసరి చేసే అవకాశం ఉంది. ఆధార్ తప్పనిసరి కాదని, ఈ స్థితిని ప్రతిబింబించేలా ఎన్ రోల్ మెంట్ ఫారాలకు తగిన మార్పులు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఈసీఐ సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
ఫారం 6బీ లో మార్పులు లేవు
అయితే ఓటరు జాబితా ధ్రువీకరణ కోసం ఆధార్ నంబర్ సమాచార లేఖ అయిన ఫారం 6బీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయడంపై పలువురు పౌర సమాజ సభ్యులు గతంలో పలుమార్లు వ్యతిరేకత వ్యక్తం చేశారు. రేషన్ కార్డులు, జాబ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు తదితర అంశాల్లో ఏ డాక్యుమెంట్ అయినా ఆధార్ తో తప్పనిసరిగా అనుసంధానం చేయడం వల్ల ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఇటీవలి అనుభవాల ద్వారా మనకు తెలుసు. అయితే ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అనుసంధానం ద్వారా బహుళ ఎపిక్ సమస్య చాలావరకు పరిష్కారమవుతుందని ఎన్నికల కమిషన్ అధికారులు వాదిస్తున్నారు.
సంబంధిత కథనం