Earthquake today : భారత్, మయన్మార్, తజకిస్థాన్‌లో భూకంపాలు- ప్రజల్లో భయం భయం!
Myanmar Earthquake today : ఆసియా, మధ్య ఆసియాల్లోని భారత్, తజకిస్థాన్, మయన్మార్‌లో ఆదివారం భూకంపాలు సంభవించాయి. పలు చోట్ల ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
భారత్‌తో పాటు మయన్మార్, తజకిస్థాన్‌లలో ఆదివారం భూకంపాలు సంభవించాయి. ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్‌లో భూమి కంపించింది. అటు భూకంపం ధాటికి మయన్మార్‌లోని ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం..
హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ జిల్లాలో ఆదివారం ఉదయం 9:18 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 3.4 తీవ్రత నమోదైంది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ వెల్లడించింది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపనలు వెలుగులోకి వచ్చాయని తెలిపింది.
హిమాచల్ భూకంపం ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు.
మయన్మార్‌లోనూ భూకంపం..
సెంట్రల్ మయన్మార్‌లోని చిన్న నగరమైన మెక్టిలా సమీపంలో ఆదివారం ఉదయం 5.5 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మార్చ్ 28న 7.7 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపంతో 3,649 మంది మృతి చెందిన ఘటన నుంచి ఇంకా కోలుకోకముందే మరోసారి ఇలా జరగడం అక్కడి ప్రజలను మరింత భయపెడుతోంది.
గత నెలలో సంభవించిన భూకంపంలో అపార నష్టం, ప్రాణనష్టం జరిగిన మయన్మార్ రెండో అతిపెద్ద నగరమైన మాండలేకు, పలు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసమైన రాజధాని నైపిటావ్కు మధ్య తాజాగా భూకంపం సంభవించింది.
తాజా భూకంపం వల్ల భారీ నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
మయన్మార్‌లో తాజా భూకంపం చాలా బలంగా ఉందని, ప్రజలు భవనాల నుంచి బయటకు పరుగులు తీశారని, కొన్ని నివాసాల పైకప్పులు దెబ్బతిన్నాయని ఇద్దరు వుండ్విన్ నివాసితులు మీడియాకి తెలిపారు.
మాండలేకు దక్షిణంగా 97 కిలోమీటర్ల దూరంలో ఉన్న వుండ్విన్ టౌన్షిప్ ప్రాంతంలో భూమికి 20 కిలోమీటర్ల లోతులో ఆదివారం భూకంపం సంభవించినట్లు మయన్మార్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది 7.7 కిలోమీటర్లు అని యూఎస్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.
థింగ్వాన్ పండు నేపథ్యంలో ఆదివారం నుంచి మయన్మార్ వ్యాప్తంగా మూడు రోజులు సెలవులు లభించాయి. ఈ సమయంలో భూకంపం సంభవించడం ఆందోళనకరం. అయితే, రద్దీని నియంత్రించేందుకు సెలవుల్లో బహిరంగ వేడుకలను రద్దు చేశారు.
తజకిస్థాన్‌లో భూకంపం..
భారత్, మయన్మార్‌తో పాటు తజకిస్థాన్‌లో ఆదివారం 16 కిలోమీటర్ల లోతులో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ విషయాన్ని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ (ఈఎంఎస్సీ) తెలిపింది.ఆ తర్వాత తీవ్రతను 6.4 నుంచి 5.9కి సవరించింది.
ఆ తర్వాత మధ్య ఆసియా దేశంలో 3.9 తీవ్రతతో మరో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలాజీ ఎక్స్‌లో తెలిపింది.
సంబంధిత కథనం