Earthquake in Delhi : దిల్లీలో భూకంపం! ప్రాణ భయంతో పరుగులు తీసిన ప్రజలు..
Delhi earthquake : దిల్లీ, పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.0గా నమోదవ్వగా.. చాలా చోట్ల ప్రజలు ప్రాణ భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ఉదయం 5:36 గంటలకు భూమికి 5 కిలోమీటర్ల లోతులో, రిక్టార్ స్కేల్‌పై 4.0 తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
దిల్లీ- ఎన్సీఆర్లో భూకంపం..
దిల్లీ, నోయిడా, ఇందిరాపురం, ఇతర ఎన్సీఆర్ ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి. చాలా చోట్ల నిద్రలో ఉన్న ప్రజలు భూకంపం ధాటికి హఠాత్తుగా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
అయితే, దిల్లీలో భూకంపంలో ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది.
ఆ వెంటనే సోషల్ మీడియాలో దిల్లీ భూకంపంపై ట్వీట్లు వెల్లువెత్తాయి. భయానక ప్రకంపనలు అనుభవించామని కొందరు నెటిజన్లు చెబుతున్నారు.
దిల్లీలో భూకంపం గురించి భారతీయ జనతా పార్టీకి చెందిన తజిందర్ బగ్గా ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “భూప్రకంపనలు వచ్చాయా? ఇది భూకంపమా?” అని ప్రశ్నించారు. చాలా మంది దీనికి సమాధానం ఇచ్చారు.
మరో బీజేపీ నేత షెహ్జాద్ పూనావాలా, “బలమైన భూకంపం! ఓహ్” అని పోస్ట్ చేశారు.
తన అలారం మేల్కొలపలేకపోయినప్పటికీ, భూకంపం మాత్రం మేల్కొలిపిందని ఒక మహిళ ట్వీట్ చెప్పింది. “నా అలారం చేయలేని పనిని చాలా బలమైన, కానీ చిన్న భూకంపం చేసింది. నేను మేల్కొని నా ప్రాణాలను కాపాడుకోవడానికి పరిగెత్తాను,” అని ఆమె పోస్ట్ చేసింది.
“ఇలాంటి భూకంపాన్ని ఎప్పుడు ఎక్స్‌పీరియెన్స్ చేయలేదు. ఇన్సేన్!” అని మరొకరు ట్వీట్ చేశారు.
“భూకంపం కొన్ని సెకన్ల పాటు వచ్చింది. మా సొసైటీ మొత్తం నిద్రలేచి పరుగులు తీసింది,” అని ఇంకొకరు చెప్పుకొచ్చారు.
న్యూదిల్లీ రైల్వే స్టేషన్‌లోని ప్రయాణీకులు ఏదో రైలు భూగర్భంలో పరుగెడుతున్నట్లు అనిపించిందని ఏఎన్ఐ వార్తా సంస్థకు తెలిపారు. "అన్నీ వణుకుతున్నాయి" అని ఒకరు అన్నారు. ప్రకంపనల వల్ల అన్నీ షేక అవుతుండటంతో ప్రజలు కేకలు వేశారని స్టేషన్‌లోని ఒక వ్యాపారి చెప్పారు.
4.0 తీవ్రత ఎందుకు ఎక్కువ భయపెట్టింది?
భారత 11వ రాష్ట్రపతి మాజీ సలహాదారు, కలాం సెంటర్ అండ్ హోమీ ల్యాబ్ వ్యవస్థాపకుడు సృజన్ పాల్ సింగ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని వివరించారు.
భూకంప కేంద్రం దిల్లీలోనే ఉన్నందున గతంలో కంటే పెద్ద ప్రకంపనలు వచ్చాయని ఆయన చెప్పారు. భూకంప కేంద్రం వద్ద ప్రకంపనలు ఇలాగే ఉంటాయని చెప్పారు.
"మీరు చూసిన దిల్లీ భూకంపం రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. ఇది ఎక్కువ కాదు (భూకంపాలు 6.0 అంతకంటే ఎక్కువ వరకు వెళ్లొచ్చు) కానీ మీరు మునుపటి కంటే పెద్ద ప్రకంపనలను అనుభవించారు. ఎందువల్ల? ఎందుకంటే భూకంప కేంద్రం దిల్లీలోనే ఉంది. భూకంప కేంద్రం వద్ద ప్రకంపనలు ఇలాగే ఉంటాయి," అని ఆయన ఎక్స్ లో రాశారు.
గత నెలలో, నేపాల్‌లో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆ ప్రకంపనలు దిల్లీ-ఎన్సీఆర్, ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలను వణికించాయి. అయితే, ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదు.
సంబంధిత కథనం