Earthquake in California : కాలిఫోర్నియాలో భూకంపం అలజడి- భయపెడుతున్న లైవ్​ దృశ్యాలు..-earthquake in california furniture topples buildings shake watch live video ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake In California : కాలిఫోర్నియాలో భూకంపం అలజడి- భయపెడుతున్న లైవ్​ దృశ్యాలు..

Earthquake in California : కాలిఫోర్నియాలో భూకంపం అలజడి- భయపెడుతున్న లైవ్​ దృశ్యాలు..

Sharath Chitturi HT Telugu
Dec 06, 2024 10:00 AM IST

California Earthquake live video : కాలిఫోర్నియాలో భూకంపానికి సంబంధించిన లైవ్​ దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. ఇళ్లు, భవనాలు కొన్ని సెకన్ల పాటు ఊగిపోతున్న దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

భూకంపం కారణంగా ఒక దుకాణంలో పరిస్థితి..
భూకంపం కారణంగా ఒక దుకాణంలో పరిస్థితి.. (AP)

భారీ భూకంపంతో అమెరికాలోని కాలిఫోర్నియా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. స్థానికకాలమానం ప్రకారం గురువారం ఉదయం, రిక్టార్​ స్కేల్​పై 7.0 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం ధాటికి అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భూకంపం నేపథ్యంలో ఇప్పటివరకు ఇంకా ఎలాంటి ప్రాణనష్టం నమోదవ్వలేదు. కాగా, కొన్ని క్షణాల పాటు భూమి కంపించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. అవి భయానకంగా ఉన్నాయి!

yearly horoscope entry point

కాలిఫోర్నియాలో భూకంపం..

ఉత్తర కాలిఫోర్నియా తీరంలో తక్కువ జనాభా కలిగిన ఫెర్న్​డేల్ పట్టణానికి పశ్చిమాన 39 మైళ్ల (63 కిలోమీటర్లు) దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైందని యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.

సుమారు 1,400 మంది జనాభా ఉన్న ఫెర్న్​డేల్ పట్టణంలో భూకంపం సంభవించడంతో చాలా మంది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

"ఇది పెద్ద భూకంపం. ప్రజలు చాలా వేగంగా భవనాల నుంచి బయటకు పరిగెత్తారు," అని ఫెర్న్​డేల్ వాలంటీర్ ఫైర్ డిపార్ట్మెంట్ సభ్యుడు ట్రాయ్ ల్యాండ్ చెప్పారు.

ముంపు ప్రాంతాన్ని తనిఖీ చేయడానికి సమయం అవసరమని అధికారులు చెప్పినప్పటికీ పెద్దగా నష్టం జరిగినట్లు ఇప్పటివరకైతే సమాచారం లేదు. కానీ పలు దుకాణాల్లో పైన ఉండే వస్తువులు భూకంపం కారణంగా కిందపడిపోయాయి. ఇది దుకాణదారులకు నష్టం కలిగించింది.

పరిస్థితులు కాస్త శాంతించిన అనంతరం ఫెర్న్​డేల్ స్థానికులు, వ్యాపార యజమానులు విరిగిన క్రోకరీలు, వస్తువులను శుభ్రపరుస్తూ కనిపించారు.

గవర్నర్ గావిన్ న్యూసమ్ ఉత్తర కాలిఫోర్నియాలో జరిగిన నష్టం గురించి ఆందోళన చెందుతున్నానని, ప్రభావిత ప్రాంతాలకు సహాయాన్ని సులభతరం చేసే విధంగా అత్యవసర ప్రకటనపై సంతకం చేశానని వెల్లడించారు.

మరోవైపు కాలిఫోర్నియాలో భూకంపం దృశ్యాలు ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కాలిఫోర్నియాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వీడియోలను పోస్ట్​ చేస్తున్నారు. వీటిల్లో ఒక వీడియో అత్యంత భయానకంగా ఉంది. పలు సెకన్ల పాటు ఇళ్లు కంపించడం, ఫలితంగా ఇళ్లల్లోని వస్తువులు తీవ్రంగా ఊగిపోవడానికి సంబంధించిన లైవ్​ దృశ్యాలు క్యాప్చర్​ అయ్యాయి.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి :

సునామీ హెచ్చరికలు ఉపసంహరణ..

భూకంపం నేపథ్యంలో సునామీ హెచ్చరికలను సైతం జారీ చేశారు. 5లక్షలకుపైగా ఫోన్స్​కి సునామీ హెచ్చరికలు వెళ్లాయి. కాగా.. కొన్ని గంటల్లోనే హెచ్చరికలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

అటు శాన్​ ఫ్రాన్సిస్కోలో కూడా భూకంపం ప్రభావం స్వల్పంగా కనిపించింది. కానీ సునామీ హెచ్చరికలు ప్రజలను భయపెట్టాయి. ఇతర ప్రాంతాల్లోని వారు, తమ కుటుంబసభ్యులకు ఫోన్స్​ చేసి హెచ్చరించారు.

“ఏదైనా ఎత్తైన ప్రాంతానికి వెళ్లమని మా నాన్న చెప్పారు. కానీ ఇక్కడి ప్రజలు ఎవరు ఆందోళన చెందలేదు. నేను కొంతసేపు ఆలోచించిన తర్వాత, కాస్త ఎత్తైన ప్రాంతానికి వెళ్లాను,” అని ఒక స్థానికుడు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.