E Commerce stocks india: ఈ-కామర్స్, అగ్రిగేటర్ కంపెనీ స్టాక్స్ గురించి తెలుసా?-e commerce stocks india nykaa to indiamart international know all about their business ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  E Commerce Stocks India Nykaa To Indiamart International Know All About Their Business

E Commerce stocks india: ఈ-కామర్స్, అగ్రిగేటర్ కంపెనీ స్టాక్స్ గురించి తెలుసా?

Praveen Kumar Lenkala HT Telugu
Jul 26, 2022 10:09 AM IST

E Commerce stocks india: ఈ-కామర్స్, అగ్రిగేటర్ సేవలు దేశంలో రోజురోజుకు విస్తరిస్తున్నాయి. వీటికి ఉజ్వల భవిష్యత్తు కూడా ఉంటుందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. స్టాక్ మార్కెట్‌లో లిస్టయి ఉన్న ఈ రంగానికి సంబంధించిన స్టాక్స్ ఏవో చూద్దాం. అయితే వాటి పనితీరు, విశ్లేషణ మాత్రం నిపుణుల సలహాలను అనుసరించి మాత్రమే అంచనా వేసుకోవాలి.

నైకా బ్యూటీ ప్రోడక్ట్స్
నైకా బ్యూటీ ప్రోడక్ట్స్ (REUTERS)

E Commerce stocks india: ఈ కామర్స్, అగ్రిగేటర్ స్టాక్స్ దేశంలో చాలానే ఉన్నా వీటిలో లిస్టయిన కంపెనీలు చాలా పరిమితంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ (nykaa):

ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ నైకా (nykaa) ఈ కామర్స్ పోర్టల్ ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ప్రధానంగా మేకప్, స్కిన్ కేర్, హెయిర్ కేర్, బాత్ అండ్ బాడీ, నాచురల్, మామ్ అండ్ బేబీ, హెల్త్ అండ్ వెల్‌నెస్, మెన్ హెల్త్, ఫ్రేగ్రెన్సెస్ తదితర కేటగిరీల్లో ప్రొడక్ట్స్ అమ్ముతుంది. విభిన్న కేటగిరీల కింద వేలాది ప్రొడక్ట్స్ ఈ ఈకామర్స్ పోర్టల్‌లో లభిస్తాయి. పర్సనల్ కేర్, హెల్త్ కేర్‌కు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్ట్స్ అమ్ముతుంది. ఆయుర్వేద, సెక్సువల్ వెల్‌నెస్ ప్రొడక్ట్స్ కూడా ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉన్నాయి. జాహ్నవీ కపూర్ ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడార్‌గా ఉన్నారు. ఇటీవలే పురుషుల లోదుస్తుల బ్రాండ్ కూడా తెచ్చింది.

ఇన్ఫో ఎడ్జ్ (ఇండియా) :

ఇన్ఫో ఎడ్జ్ ఇండియా కూడా ఆన్‌లైన్ వ్యాపారంలో నిమగ్నమైంది. నౌకరీ డాట్ కామ్, నౌకరీగల్ఫ్ డాట్ కామ్, శిక్షా డాట్ కామ్, జీవన్‌సాథీ డాట్ కామ్, 99ఏకర్స్ డాట్ కామ్, ఫస్ట్ నౌకరీ డాట్ కామ్, క్వాడ్రాంగిల్, జాబ్ హై, ఆంబిషన్ బాక్స్ తదితర అనేక ప్రముఖ వెబ్‌సైట్లను ఈ కంపెనీ కలిగి ఉంది. లక్షలాది మంది యూజర్ల బేస్ కలిగి ఉంది. దేశ జనాభాలో యూత్ వాటా ఎక్కువగా ఉంది. విద్య, ఉద్యోగం, మ్యాట్రిమోనీ, రియల్ ఎస్టేట్ రంగాలకు డిమాండ్ నానాటికి పెరుగుతున్న సంగతి తెలిసిందే.

వన్ 97 (పేటీఎం):

పేటీఎం మాతృ కంపెనీ వన్ 97 ఇటీవలికాలంలో మార్కెట్లో లిస్టయిన కంపెనీ. యూపీఐ పేమెంట్స్, ఈ కామర్స్ ద్వారా పాపులర్ అయ్యింది. అయితే లిస్టయిన తరువాత వేగంగా, భారీగా ఈ స్టాక్ పడిపోయింది.

జొమాటో లిమిటెడ్:

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్‌గా ఉన్న ఈ కంపెనీ కూడా ఇటీవలే మార్కెట్లో లిస్టయింది. అయితే ఈ కంపెనీ గ్రోఫర్స్ కంపెనీని అత్యధిక విలువ చెల్లించి కొనుగోలు చేసిందన్న ఆరోపణల కారణంగా ఇది కూడా భారీగా, వేగంగా పడిపోయింది. జూలై 25న ఏకంగా 10 శాతానికి పైగా పడిపోయింది.

ఇండియా‌మార్ట్ ఇంటర్నేషనల్:

ఇండియామార్ట్ ఇంటర్నేషనల్ సంస్థ ఒకరకంగా చెప్పాలంటే అలిబాబా కంపెనీలాంటిది. అంటే హోల్‌సేల్ సప్లయర్స్‌తో రీటైలర్లు, కస్టమర్లు ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ఇది వేదికగా పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు టీషర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఈ వెబ్‌సైట్‌కు వెళ్లి హోల్ సేల్ సప్లయిర్స్‌ను వెతుక్కుని వారితో సంప్రదింపులు చేయవచ్చు. కోవిడ్ మహమ్మారి అనంతరం ఈ కంపెనీ వేగంగా పుంజుకుంది.

జస్ట్ డయల్:

మనకు దగ్గర్లో ఏది అవసరం ఉన్నా జస్ట్ డయల్‌కు ఫోన్ చేస్తే చాలు.. కాంటాక్ట్ నెంబర్లు, అడ్రస్‌లు కుప్పలుతెప్పలుగా మన మొబైల్‌లో వచ్చిపడతాయి. రియల్ ఎస్టేట్, బీటీబీ, ఎయిర్ టికెట్స్, లోన్స్, ఆటోకేర్, ఆటోమొబైల్, బేబీకేర్, ఇలా అనేక రంగాల్లో ఈ కంపెనీ సేవలు అందిస్తోంది.

న్యురెకా:

హెల్త్ కేర్ కంపెనీ ఇది. వివిధ వ్యాధులకు ఉపయోగపడే మెడికల్ డివైజెస్‌ను తన వెబ్‌సైట్ ద్వారా అమ్ముతుంది. క్రానిక్ డిసీజెస్, ఆర్థోపెడిక్ ప్రోడక్ట్స్, లైఫ్ స్టయిల్ ప్రోడక్ట్స్, మదర్ అండ్ బేబీకేర్, న్యూట్రిషన్, ఇలా విభిన్న కేటగిరీల ప్రోడక్ట్స్ అమ్ముతుంది.

ఒలింపియా ఇండస్ట్రీస్:

బేబీకేర్, హోమ్, కిచెన్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, అప్లయెన్సెస్ ప్రోడక్ట్స్‌, కార్ అండ్ వెహికిల్ ఎలక్ట్రానిక్స్, కార్ యాక్సెసరీస్, కార్ పార్ట్స్, మోటార్ బైక్ యాక్సెసరీస్, పార్ట్స్, ఆయిల్స్, ఫ్ల్యూయడ్స్, ట్రాన్స్‌పోర్టింగ్ అండ్ స్టోరేజ్ విభాగాల్లో ప్రోడక్ట్స్‌ను అమెజాన్ తదితర ఈకామర్స్ కంపెనీలకు సరఫరా చేస్తుంది. ఆయా ఈకామర్స్ పోర్టల్స్ ద్వారా అమ్ముతుంది.

ఇవే కాకుండా లిస్టెడ్ కంపెనీల్లో ఫోన్4కమ్యూనికేషన్స్, సిటిజెన్ ఇన్ఫోలైన్, ఐస్ట్రీట్ నెట్‌వర్క్, జేఎల్ఏ ఇన్‌ఫ్రావిల్లే తదితర ఈకామర్స్ సంస్థలు కూడా మార్కెట్లో లిస్టయి ఉన్నాయి.

టెక్నాలజీ ఏదైనా కంపెనీ లాభదాయకత, సేల్స్, మేనేజ్‌మెంట్ పనితీరు, గడిచిన కొన్నేళ్లుగా కంపెనీ పనితీరు ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని, నిపుణుల సలహా మేరకే పెట్టుబడులు పెట్టడం శ్రేషయస్కరం. ఆయా కంపెనీల్లో లాభాలు తెచ్చిపెట్టిన కంపెనీలు అతి స్వల్పమే కావడం వల్ల లోతుపాతులు విశ్లేషించాల్సిన అవసరం ఉంటుంది.

అయితే నేరుగా ఈకామర్స్ బిజినెస్ చేయకపోయినా తమ ఉత్పత్తులను ఇప్పుడు చాలా కంపెనీలు ఆన్‌లైన్‌లో సేల్ చేస్తున్నాయి. వీటిలో లిస్టెడ్ కంపెనీలు కూడా ఉన్నాయి.

WhatsApp channel