Kerala ragging: మర్మాంగాలకు డంబెల్స్ వేలాడదీసి..; నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ దారుణాలు
Kerala ragging: కేరళలోని ఒక నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్ పేరిట జరిగిన దారుణ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కాలేజీలో 2024 నవంబర్లో ప్రారంభమైన ర్యాగింగ్ అప్పటి నుండి కొనసాగుతోంది. సీనియర్లు బాధిత విద్యార్థుల ప్రైవేట్ పార్ట్స్ కు డంబెల్స్ వేలాడదీసి, చిత్రహింసలకు గురి చేశారు.

Kerala ragging: కేరళలోని కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల దుస్తులను బలవంతంగా విప్పించి, వారి మర్మాంగాలకు డంబెల్స్ ను వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు థర్డ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులను అరెస్టు చేశామని, ముగ్గురు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
2024 నవంబర్ నుంచే..
యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద నమోదైన ఫిర్యాదు ప్రకారం 2024 నవంబర్లో ర్యాగింగ్ ప్రారంభమైందని, అప్పటి నుంచి ర్యాగింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థులు ఇచ్చిన పిర్యాదు ప్రకారం.. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. వారు జూనియర్ విద్యార్థులను నగ్నంగా నిలబడమని బలవంతం చేసి, ఆపై వ్యాయామంలో ఉపయోగించే డంబెల్స్ ను వారి ప్రైవేట్ భాగాలకు వేలాడ దీసేవారు. థర్డ్ ఇయర్ విద్యార్థులు కంపాస్ లు, ఇతర వస్తువులను ఉపయోగించి తమను తీవ్రంగా గాయపర్చారని విద్యార్థులు ఆరోపించారు. ఆ తర్వాత ఆ గాయాల నొప్పిని పెంచడానికి వాటిపై లోషన్ పూయమని బలవంతం చేసేవారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. ఈ వేధింపుల గురించి బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని సీనియర్లు బెదిరించారు. అంతేకాదు, జూనియర్ విద్యార్థుల నుంచి సీనియర్లు తరచూ డబ్బులు వసూలు చేసేవారని, ఆదివారం మద్యం కొనుగోలు చేసేందుకు జూనియర్ల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకునేవారని బాధిత విద్యార్థులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
పోలీసులకు ఫిర్యాదు
సీనియర్ల ఆగడాలు ఆగకపోవడంతో, ముగ్గురు విద్యార్థులు కొట్టాయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరెస్టయిన ఐదుగురు థర్డ్ ఇయర్ విద్యార్థులను బుధవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనున్నారు.
సంబంధిత కథనం
టాపిక్