DRDO scientist honeytrap: డీఆర్డీఓ సైంటిస్ట్ కు హనీ ట్రాప్; పాక్ సీక్రెట్ ఏజెంట్ కు రక్షణ శాఖ సీక్రెట్స్ వెల్లడి
DRDO scientist honeytrap: పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్ వలలో పడిన డీఆర్డీఓ శాస్త్రవేత్త.. ఆమెకు భారత క్షిపణి ప్రయోగాలకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలియజేశాడు. ఈ వివరాలను ఏటీఎస్ తమ చార్జిషీట్ లో వెల్లడించింది.

DRDO scientist honeytrap: పుణెలోని డీఆర్డీఓ లో డైరెక్టర్ హోదాలో పనిచేసే 60 ఏళ్ల ప్రదీప్ కురుల్కర్ (Pradeep Kurulkar).. పాకిస్తాన్ కు చెందిన ఒక మహిళా సీక్రెట్ ఏజెంట్ వలలో (honeytrap) పడిపోయాడు. ఆ మహిళకు డీఆర్డీఓ కు సంబంధించిన కీలక క్షిపణి పరీక్షల వివరాలను, డ్రోన్స్ వివరాలను, రోబోటిక్ ప్రోగ్రామ్స్ వివరాలను వెల్లడించి, దేశ రక్షణను, సమగ్రతను ముప్పులో పడేశాడు.
ఏటీఎస్ చార్జిషీట్ లో సంచలనాలు..
కీలక రక్షణ సమాచారాన్ని పాక్ ఏజెంట్ కు అందించాడన్న సమాచారంపై.. పుణెలోని డీఆర్డీఓ లో డైరెక్టర్ హోదాలో పనిచేసే ప్రదీప్ కురుల్కర్ ను మహారాష్ట్రకు చెందిన యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్ () అధికారులు మే 3 వ తేదీన అరెస్ట్ చేశారు. అనంతరం, అతడిని విచారించగా, పలు సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం, జూన్ 30వ తేదీన ఏటీఎస్ ముంబైలోని స్పెషల్ కోర్టులో ప్రదీప్ కురుల్కర్ పై చార్జిషీట్ ను దాఖలు చేసింది. ప్రదీప్ కురుల్కర్ కు, పాక్ మహిళా సీక్రెట్ ఏజెంట్ కు మధ్య జరిగిన చాట్స్ ను ఏటీఎస్ వెల్లడించింది. డీఆర్డీఓ లో ప్రదీప్ కురుల్కర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంలో డైరెక్టర్ హోదాలో ఉన్న సమయంలో ఆ మహిళతో కీలకమైన రక్షణ సమాచారాన్ని పంచుకున్నాడు. ఆమెతో మరింత సాన్నిహిత్యం పెంచుకోవడం కోసం దేశ రక్షణను పణంగా పెట్టాడు.
ఫేక్ అకౌంట్స్ తో హనీట్రాప్
ఏటీఎస్ చార్జిషీట్ వివరాల ప్రకారం.. ప్రదీప్ కురుల్కర్ ను ఆ పాక్ సీక్రెట్ ఏజెంట్ చాలా ప్లాన్డ్ గా వలలో వేసుకుంది. వివిధ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా వేరు వేరు పేర్లతో అతడి కాంటాక్ట్ లోకి వచ్చింది. లండన్ కోడ్ అయిన +44 తో ప్రారంభమయ్యే రెండు ఫోన్ నెంబర్ల ను ఆమె ఉపయోగించింది. జరా దాస్ గుప్తా, జూహీ అరోరా అనే పేర్లతో సోషల్ మీడియా అకౌంట్స్ ను ప్రారంభించి, ప్రదీప్ కురుల్కర్ తో చాట్ చేసింది. శృంగార సంభాషణలతో అతడిని పూర్తిగా వశపర్చుకున్న అనంతరం, అతడి నుంచి డీఆర్డీఓ లో జరుగుతున్న వివిధ ప్రయోగాల సమాచారాన్ని సేకరించింది. అందులో బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం, మీటియో మిస్సైల్ ప్రయోగం, రఫేల్ యుద్ధ విమానాల వివరాలు, ఆకాశ్, అస్త్ర, అగ్ని 6 వంటి క్షిపణుల సమాచారం ఉంది. ఆమెను సంతోషపెట్టడం కోసం, ఆమెకు మరింత సన్నిహితం కావడం కోసం అత్యంత కీలకమైన రక్షణ సమాచారాన్ని ఆమెకు తెలియజేశాడు. ఆమెను బేబ్ (Babe) అని సంబోధిస్తూ చాట్ చేశాడు.
గొప్పలు చెప్పుకునే నేచర్
ప్రదీప్ కురుల్కర్ కు గొప్పలు చెప్పుకునే మనస్తత్వం ఉన్నట్లు ఏటీఎస్ తన 1837 పేజీల చార్జిషీట్లో పేర్కొంది. ఒక చాట్ లో.. అగ్ని 6 ప్రయోగం సక్సెస్ అయిందా? అన్న పాక్ మహిళా సీక్రెట్ ఏజెంట్ ప్రశ్నకు.. ‘దాన్ని డిజైన్ చేసింది నేనే బేబ్.. అది నా బ్రెయిన్ చైల్డ్. సక్సెస్ కాకుండా ఎలా ఉంటుంది. అది గ్రేట్ సక్సెస్’ అని జవాబిచ్చినట్లు ఏటీఎస్ వివరించింది. పాక్ ఏజెంట్ కు, ప్రదీప్ కురుల్కర్ కు మధ్య ఎక్కువగా చాట్స్ 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఫిబ్రవరి మధ్య జరిగాయని వెల్లడించింది.