Dr Manmohan Singh passes away: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) గురువారం కన్నుమూశారు. ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ 1990 దశకంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలన్న మన్మోహన్, నాటి ప్రధాని పీవీ నరసింహరావుల సాహసోపేత నిర్ణయం దేశ ఆర్థిక గతిని మార్చింది.
1991లో భారతదేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయి ఉన్నప్పుడు దివంగత ప్రధాని పివి నరసింహారావు ప్రసిద్ధ ఆర్థికవేత్త అయిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా ప్రభుత్వంలో చేర్చుకున్నారు. ఆ విధంగా మన్మోహన్ సింగ్, అనూహ్యంగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ ఇరువురు నేతలు కలిసి ఆర్థిక వ్యవస్థను చెల్లింపుల సంక్షోభం నుంచి గట్టెక్కించి, ఆర్థిక సంస్కరణలకు పునాది వేశారు. ఆ సంస్కరణల ఫలితమే నిజానికి నేటి దేశ ఆర్థిక పురోగతి అని చెప్పవచ్చు.