QR code on tomb: కేరళలో ఒక యువ వైద్యుడు Dr Ivin Francis 26 ఏళ్ల వయస్సుకే చనిపోయాడు. అతడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం కోసం అతడి తల్లిదండ్రులు ఆ యువకుడి సమాధిపై ఒక క్యూఆర్ కోడ్ (QR code) ను ముద్రించారు.
డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిన్ (Dr Ivin Francis) యువ వైద్యుడు. అతడి తండ్రి ఫ్రాన్సిన్ ఒమన్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఆఫీసర్. తల్లి లీనా ఒమన్ లోని ఒక ఇండియన్ స్కూల్ క ప్రిన్సిపాల్ గా ఉన్నారు. డాక్టర్ ఇవిన్ (Dr Ivin Francis) మొదటి నుంచి చదువుతో పాటు స్పోర్ట్స్, మ్యూజిక్, టెక్ రంగాల్లో యాక్టివ్ గా ఉండేవాడు. 2021లో తన 26 ఏళ్ల వయస్సులో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు.
ఆ యువకుడి జ్ఞాపకాలను సజీవంగా ఉంచడం కోసం, వాటిని అందరికీ అందించడం కోసం అతడి తల్లిదండ్రులైన ఫ్రాన్సిన్, లీనాలు త్రిస్సూర్ లోని సెయింట్ జోసెఫ్ చర్చ్ లో నిర్మించిన ఇవిన్ ఫ్రాన్సిస్ సమాధిపై ఒక క్యూఆర్ కోడ్ (QR code) ను శాశ్వతంగా ఉండేలా ముద్రించారు. ఆ క్యూఆర్ కోడ్ (QR code) కు ఒక వెబ్ పేజీని అనుసంధానించారు. దాంతో, ఎవరైనా ఆ కోడ్ ను స్కాన్ చేస్తే, ఆ వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో డాక్టర్ ఇవిన్ (Dr Ivin Francis) ఫ్రాన్సిస్ జీవిత విశేషాలు, ఆయన సాధించిన విజయాలు, ఇతర వివరాలు తెలుస్తాయి. ఇలా తమ కుమారుడి జీవిత విశేషాలను చరిత్రలో నిలిచేలా చేశారు.
వృత్తి పరంగా డాక్టరే అయినా, టెక్నాలజీపై ఆసక్తితో డాక్టర్ ఇవిన్ ఫ్రాన్సిస్ (Dr Ivin Francis) గతంలో తెలిసినవారి కోసం ఇలాగే క్యూఆర్ కోడ్ (QR code) లను జెనరేట్ చేసి, వాటికి అనుసంధానంగా వెబ్ పేజీలను సృష్టించేవాడని ఫ్రాన్సిన్ గుర్తు చేసుకున్నాడు. అందుకే, తాము కూడా ఇవిన్ కోసం ఒక క్యూఆర్ కోడ్ (QR code) ను జెనరేట్ చేసి, దానికి అనుసంధానంగా అతడి జీవిత విశేషాలున్న వెబ్ పేజీని సృష్టించామన్నారు. ఈ ఐడియా నిజానికి ఇవిన్ సోదరి ఎవ్లిన్ ఫ్రాన్సిన్ దన్నారు. ‘‘సమాధిపై గుర్తుగా పేరు ఇతర వివరాలు రాయడానికి బదులుగా ఒక క్యూఆర్ కోడ్ (QR code) ను ముద్రిస్తే, సోదరుడి జీవిత విశేషాలు, అతడి స్ఫూర్తిదాయక విజయాలు అందరికీ తెలుస్తాయని ఆమె సూచించారు’’ అని ఫ్రాన్సిస్ వివరించారు.