US President Donald Trump : అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం.. తొలి ప్రసంగంలో కీలక కామెంట్స్
US President Donald Trump : అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత మెుదటి ప్రసంగంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్‌తో అమెరికా చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయించారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు ప్రపంచంలోని పలువురు అగ్రనేతలు హాజరు అయ్యారు. ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు జెడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
అంతకుముందు పదవి విరమణ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కలిసేందుకు ట్రంప్ వైట్ హౌస్ వెళ్లారు. బైడెన్ దంపతులు ట్రంప్‌కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి యూఎస్ క్యాపిటల్‌కు చేరుకున్నారు. వారితో కమలా హారిస్, జెడీ వాన్సన్ కూడా ఉన్నారు. తర్వాత కాసేపటికి ట్రంప్‌తో చీఫ్ జస్టిస్ రాబర్ట్స్ ప్రమాణస్వీకారం చేయించారు.
హాజరైన ప్రముఖులు
పారిశ్రామిక వేత్తలు, టెక్ దిగ్గజాలు ఈ వేడుకలో పాల్గొన్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ట్రంప్‌ను ప్రధాని మోదీ రాసిన లేఖను జైశంకర్ అందజేశారు. ఈ వేడుకకు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా కూడా హాజరయ్యారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌వంటి ప్రముఖులు ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవంలో మెరిశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దంపతులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ప్రధాని మోదీ అభినందనలు
'అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు, రెండు దేశాలకు మేలు చేకూర్చేందుకు మంచి భవిష్యత్తు కోసం మరోసారి కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాను.' అని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డోనాల్డ్ ట్రంప్ తొలి ప్రసంగం
ప్రమాణస్వీకారం చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన తొలి ప్రసంగంలో అమెరికాకు స్వర్ణయుగం మొదలైందని చెప్పారు. మన సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటామన్నారు. 'అక్రమ చొరబాట్లను తక్షణమే నిలిపివేస్తాం. దక్షిణ సరిహద్దులో జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తాం. మెక్సికో సరిహద్దులో ఎమర్జెన్సీ ఉంటుంది. ఈ రోజు నుండి మన దేశం మళ్లీ అభివృద్ధి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా మనం గౌరవించబడతాం. గర్వించదగిన సంపన్నమైన, స్వేచ్ఛాయుతమైన దేశాన్ని నిర్మించడం ప్రధాన ప్రాధాన్యత.' అని ట్రంప్ అన్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ప్రసంగంలో అధ్యక్ష ఎన్నికల సమయంలో తాను ఎదుర్కొన్న సవాళ్ల గురించి, హత్యాయత్నం గురించి మాట్లాడారు. అమెరికాను మళ్లీ గొప్పగా మార్చడానికి దేవుడు తనను రక్షించాడని చెప్పారు. లాస్ ఏంజిల్స్ వైల్డ్ ఫైర్ మీద కూడా ట్రంప్ స్పందించారు.
ఆటోమొబైల్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి గ్రీన్ న్యూ డీల్‌ను ముగించి జాతీయ ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్లను ఉగ్రవాదులుగా ప్రకటిస్తామని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికాలో అందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంటుందని చెప్పారు. ఇతర దేశాలపై సుంకాలు పెంచుతామని ట్రంప్ స్పష్టం చేశారు.
'మేం మళ్లీ ప్రపంచంలోనే బలమైన మిలిటరీని సృష్టిస్తాం. గెలిచిన యుద్ధాల ద్వారా మాత్రమే విజయాన్ని కొలుస్తాం.' అన్నారు.