Donald Trump : జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. ఇప్పటివరకు 170 మిలియన్ డాలర్ల విరాళాలు!-donald trump swearing in ceremony on january 20 external affairs minister jaishankar to represent india know in details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Donald Trump : జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. ఇప్పటివరకు 170 మిలియన్ డాలర్ల విరాళాలు!

Donald Trump : జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం.. ఇప్పటివరకు 170 మిలియన్ డాలర్ల విరాళాలు!

Anand Sai HT Telugu
Jan 12, 2025 05:32 PM IST

Donald Trump Swearing : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. భారత్‌కు కూడా ఆహ్వానం అందింది. కేంద్రమంత్రి ఎస్ జైశంకర్ ఈ కార్యక్రమానికి వెళ్లనున్నారు.

డొనాల్డ్ ట్రంప్
డొనాల్డ్ ట్రంప్ (AP)

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనవరి 20న వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ భవనంలో ఆయన ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి గ్లోబల్ లీడర్ల నుంచి టెక్ దిగ్గజాలు, ఇతరులు హాజరుకానున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి అమెరికా నుంచి భారత్, చైనాలకు ఆహ్వానాలు కూడా వెళ్లాయి. భారత్ నుంచి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, అయితే చైనా అధ్యక్షుడు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఎటువంటి సమాచారం లేదు.

చైనా అధ్యక్షుడికి పిలుపు

ట్రంప్ అతిథుల జాబితాలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రపంచ వేదికపై అమెరికాకు అతిపెద్ద ప్రత్యర్థిగా ఉన్న చైనా అధ్యక్షుడిని తన ప్రమాణస్వీకారానికి పిలవడం ఒక ముఖ్యమైన అడుగు. ట్రంప్ తన మిత్రులనే కాకుండా శత్రువులను, పోటీలో ఉన్న వ్యక్తులను కూడా ఆహ్వానించాలనుకుంటున్నారని ట్రంప్ అధికార ప్రతినిధి లెవిట్ తెలిపారు. చైనా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేనప్పటికీ, ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ లేదా విదేశాంగ మంత్రి వాంగ్ యీని అమెరికాకు పంపే అవకాశం ఉంది. ఇటలీ, అర్జెంటీనా తదితర దేశాల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

భారత్ తరఫున ఎస్ జైశంకర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హాజరుకానున్నారు. జనవరి 20న వాషింగ్టన్ డీసీలో జరిగే కార్యక్రమంలో విదేశాంగ మంత్రి పాల్గొంటారని ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. దీనితో పాటు అక్కడ ఉన్న పలువురు ప్రపంచ నాయకులతో కూడా ఆయన సమావేశమవుతారు.

ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు అమెరికాతో పాటు ప్రపంచం నుంచి చాలా మంది ఎదురు చూస్తున్నారు. తద్వారా రాబోయే ట్రంప్ ప్రభుత్వానికి తమ మద్దతును చూపించవచ్చు. ఈ కార్యక్రమానికి పలువురు అమెరికన్ టెక్ దిగ్గజాలు విరాళాలు అందించారు.

170 మిలియన్ డాలర్లు

డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఇప్పటి వరకు 170 మిలియన్ డాలర్లు వచ్చాయి. కొత్త ప్రభుత్వంతో తమ సంబంధాలను పటిష్టంగా ఉంచుకోవడానికి, పలువురు వ్యాపార దిగ్గజాలు.. ట్రంప్ బృందానికి ఉదారంగా విరాళాలు ఇచ్చారు. న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు 170 మిలియన్లు వచ్చాయి. త్వరలో ఈ సంఖ్య 200 మిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. బోయింగ్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ వంటి బడా వ్యాపార సంస్థలు భారీగా విరాళాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ట్రంప్ ప్రమాణస్వీకారోత్సవానికి పెద్ద సంఖ్యలో ప్రజలు రాబోతున్నారని అంటున్నారు. విరాళాలు ఇచ్చే వారికి కూడా వీఐపీ టికెట్లు నిరాకరిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్థలం కొరత, ఇప్పటికే సీట్లు నిండిపోవడంతో చాలా మందికి వీఐపీ పాసులు నిరాకరించినట్లు తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.