అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శత్రు దేశాల క్షిపణి దాడుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంతో 'గోల్డెన్ డోమ్' అనే కొత్త క్షిపణి రక్షణ కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న బిల్లులో ఈ ప్రాజెక్టుకు ప్రస్తుతానికి 25 బిలియన్ డాలర్లను కేటాయించాలని ప్రతిపాదించినట్లు ఆయన వెల్లడించారు.
వైట్ హౌస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ తన పదవీకాలం ముగిసేనాటికి గోల్డెన్ డోమ్ పనిచేయడం ప్రారంభం కావాలని అన్నారు. ఈ గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ మొత్తం వ్యయం సుమారు 175 బిలియన్ డాలర్లుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తాను ప్లాన్ చేస్తున్న గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కవచంలోని 'ప్రతిదీ' అమెరికాలోనే తయారవుతుందని ఆయన చెప్పారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో చేరేందుకు కెనడా ఆసక్తి చూపిందని, ఈ ప్రయత్నంలో అమెరికా కెనడాకు మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు.
అత్యాధునిక క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మిస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో అమెరికా ప్రజలకు హామీ ఇచ్చానని ట్రంప్ తెలిపారు. ఈ అత్యాధునిక వ్యవస్థకు ఆర్కిటెక్చర్ ను అధికారికంగా ఎంపిక చేసినట్లు ప్రకటించడానికి సంతోషంగా ఉందన్నారు. గోల్డెన్ డోమ్ కార్యక్రమం అమలు, పర్యవేక్షణకు ప్రస్తుత వైస్ చీఫ్ ఆఫ్ స్పేస్ ఆపరేషన్స్ జనరల్ మైఖేల్ గుట్లీన్ నేతృత్వం వహిస్తారని ట్రంప్ వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మిలటరీ నేతలు మద్దతు తెలిపారని ట్రంప్ తెలిపారు.
డొపాల్డ్ ట్రంప్ ఆదేశించిన గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ఉపగ్రహ ఆధారిత నెట్ వర్క్ ను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. క్షిపణి నిఘా, ప్రతిస్పందనకు అంకితమైన వందలాది ఉపగ్రహాలను ఈ వ్యవస్థలో మోహరిస్తారు. గోల్డెన్ డోమ్ కాన్సెప్ట్ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ నుండి ప్రేరణ పొందింది. ఇది రాకెట్లు మరియు క్షిపణుల నుండి రక్షణ కల్పిస్తుంది. అమెరికా రూపొందిస్తున్న గోల్డెన్ డోమ్ మరింత విస్తృతమైనది. నిఘా ఉపగ్రహాల యొక్క విస్తారమైన నెట్ వర్క్, ప్రయోగించిన కొద్దిసేపటికే శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి రూపొందించిన ప్రత్యేక స్ట్రైక్ శాటిలైట్లను ఇది కలిగి ఉంది.
సంబంధిత కథనం