Trump Tariffs : మెక్సికోపై సుంకాలను ఒక నెలపాటు నిలిపివేసిన ట్రంప్.. కెనడాతోనూ చర్చలు!-donald trump agreed to pause tariffs for one month on mexico check all details inside ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Trump Tariffs : మెక్సికోపై సుంకాలను ఒక నెలపాటు నిలిపివేసిన ట్రంప్.. కెనడాతోనూ చర్చలు!

Trump Tariffs : మెక్సికోపై సుంకాలను ఒక నెలపాటు నిలిపివేసిన ట్రంప్.. కెనడాతోనూ చర్చలు!

Anand Sai HT Telugu
Feb 03, 2025 10:22 PM IST

Trump Tariffs : మెక్సికో వస్తువులపై విధించిన సుంకాలను ఒక నెలపాటు నిలిపేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. మరోవైపు సుంకాల విషయంలో కెనడాతో చర్చలు జరుపుతున్నారు.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇతర దేశాలపై సుంకాల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు ఇతర దేశాలు దీనిపై స్పందించడం ప్రారంభించాయి. అమెరికా విధించిన సుంకం తర్వాత కెనడా కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను ప్రకటించింది. ఈ మేరకు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌లతో ట్రంప్ మాట్లాడారు.

yearly horoscope entry point

వెనక్కు తగ్గిన ట్రంప్

ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సుంకాల విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఇటీవలే కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలను విధిస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే దీనిపై రెండు దేశాలు ప్రతీకార చర్యలకు సిద్ధమయ్యాయి. అయితే తాజాగా ట్రంప్ వెనక్కు తగ్గారు. మెక్సికన్ వస్తువులపై ఒక నెలపాటు సుంకాలను నిలుపుదల చేసేందుకు ట్రంప్ అంగీకరించారు.

మాదకద్రవ్యాలపై

ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి చర్చలు కొనసాగుతాయని ట్రంప్ సోషల్ మీడియా పోస్ట్‌లో తెలిపారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ ప్రకటన చేశారు. మెక్సికో, యూఎస్ భద్రత, వాణిజ్యంపై పని చేయడం ప్రారంభిస్తాయని షీన్‌బామ్ కూడా ధృవీకరించారు. ఒప్పందాల్లో భాగంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాడేందుకు మెక్సికో 10,000 మంది నేషనల్ గార్డ్ సభ్యులను యునైటెడ్ స్టేట్స్‌తో సరిహద్దు వెంబడి మోహరించనుందని ఆమె తెలిపారు.

ట్రంప్ ఇటీవల కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలను ప్రకటించారు. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా నుంచి వచ్చే వస్తువులపై 10 శాతం సుంకాన్ని ట్రంప్ విధించారు.

కెనడా ప్రతీకారం

మరోవైపు అమెరికా విధించిన సుంకాలను ఎదుర్కోవడానికి కెనడా కూడా అమెరికన్ వస్తువులపై సుంకాలను పెంచింది. కెనడా నిర్ణయం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడవ్వక ముందే కెనడాకు వ్యతిరేకంగా తన వైఖరిని స్పష్టం చేశారు. ఇటీవల కెనడాపై సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు.

దీనికి ప్రతిస్పందనగా ట్రూడో విలేకరుల సమావేశం నిర్వహించి 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికన్ ఉత్పత్తులపై 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఈ ఉత్పత్తులలో బీర్, వైన్, గృహోపకరణాలు, క్రీడా వస్తువులు ఉన్నాయి. అదే సమయంలో కెనడియన్ ప్రజలు కూడా అమెరికన్ ఉత్పత్తులను బహిష్కరించడం ప్రారంభించారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రకటించిన ట్రూడో తాను కెనడియన్ల వెంట ఉంటానని చెప్పారు. ఈ సుంకాల విషయంపై ఇరు దేశాల అధినేతలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.