GST on Gangajal: పవిత్ర గంగాజలంపై కూడా జీఎస్టీ విధించారా?.. వివరణ ఇచ్చిన సీబీఐసీ
GST on Gangajal: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం హిందువులు అత్యంత పవిత్రంగా భావించే గంగా జలంపై కూడా 18% జీఎస్టీ విధించిందని మీడియాలో వచ్చిన వార్తలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) స్పందించింది.
GST on Gangajal: పవిత్ర గంగాజలంపై 18% జీఎస్టీ విధించారన్న వార్తలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) వివరణ ఇచ్చింది. గంగా జలం సహా పూజకు ఉపయోగించే ఏ వస్తువు పైన కూడా జీఎస్టీ విధించలేదని స్పష్టం చేసింది.
ఖర్గే విమర్శ..
ప్రధాని మోదీ ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న సమయంలో.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మోదీని ఉద్దేశించి ఒక విమర్శ చేశారు. పవిత్ర గంగా మాతను మోక్ష ప్రదాతగా ప్రతీ భారతీయుడు భావిస్తాడని, గంగా నది గంగా మాతగా పూజిస్తాడని, అలాంటి గంగా జలం (Gangajal) పై పన్ను విధించడమేంటని ఖర్గే ప్రశ్నించారు. పవిత్ర గంగాజలంపై కూడా మీ ప్రభుత్వం గరిష్టంగా 18% జీఎస్టీ (GST) విధించిందని, దీనికి ఏం సమాధానమిస్తారని ఆయన ప్రశ్నించారు. ఖర్గే విమర్శలతో పాటు మీడియాలో కూడా గంగాజలంపై జీఎస్టీ విధింపునకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు, విమర్శలు వచ్చాయి. నవరాత్రి ఉత్సవాల సమయంలో ఈ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ కావడంతో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (Central Board of Indirect Taxes and Customs - CBIC) దీనిపై శుక్రవారం వివరణ ఇచ్చింది.
ఏ పన్నూ లేదు..
గంగాజలం పై 18% జీఎస్టీ విధించామని వచ్చిన వార్తలపై వాస్తవం లేదని సీబీఐసీ స్పష్టం చేసింది. గంగా జలంతో పాటు ఏ పూజా సామగ్రిపై కూడా జీఎస్టీ విధించలేదని వివరణ ఇచ్చింది. గంగా జలం సహా పూజకు ఉపయోగించే అన్ని వస్తువులపై జీఎస్టీ విధించడానికి సంబంధించి 2017 లోనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో లోతైన చర్చ జరిగిందని సీబీఐసీ వెల్లడించింది. 2017 లో జరిగిన 14వ, 15వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో ఈ విషయంపై చర్చ జరిగిందని తెలిపింది. గంగా జలం, ఇతర పూజా సామగ్రిపై జీఎస్టీ విధించకూడదని ఆ సమావేశాల్లోనే నిర్ణయించారని సీబీఐసీ వెల్లడించింది. జీఎస్టీ ప్రారంభమైన తొలి నుంచి కూడా గంగా జలం, పూజా సామగ్రిపై జీఎస్టీ లేదని స్పష్టం చేసింది.