జనవరి 13న మొదలైన మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటోంది. ఫిబ్రవరి 26తో ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 55 కోట్లకుపైగా మంది భక్తులు సంగం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. అయితే, ఒక స్థానిక ఎంటర్ప్రెన్యూర్.. వినూత్నంగా ఆలోచించాడు! అదే.. ‘డిజిటల్ స్నానం’! ఆయన చేసిన పని తెలిస్తే.. “ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా? ” అని అనిపించడం ఖాయం.
మహా కుంభమేళాకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా, వెళ్లలేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వీరి కోసమే 'డిజిటల్ స్నానం' సేవను తీసుకొచ్చారు దీపక్ అనే వ్యక్తి. మీరు వాట్సాప్ ద్వారా ఫొటోలను షేర్ చేస్తే, ఆయన ఆ ఫొటోలను ప్రింటౌట్ తీసీ, వాటిని సంగంలో ముంచుతాడు. అలా మీకు ‘డిజిటల్ స్నానం’ చేయిస్తాడు! ఇందుకోసం ఆయన రూ. 1,100 తీసుకుంటాడు.
ప్రముఖ యూట్యూబర్, ‘దేశభక్త్’ ఆకాశ్ బెనర్జీ ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోలో సదరు వ్యక్తి.. తాను చేసే డిజిటల్ స్నానం గురించి సవివరంగా చెబుతున్నాడు. ఈ వీడియో చూసిన వారందరు.. “వాహ్ వాట్ ఆన్ ఐడియా” అని అనుకుంటున్నారు.
ఈ పోస్టుకు ఇంటర్నెట్ నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. 'చైనాకు డీప్‌సీక్ ఉంది. మనకి డీప్ స్నాన్ ఉంది' అని ఒక యూజర్ చమత్కరించారు. మరొకరు 'రామ్ నామ్ కీ లూట్ హై, లూట్ సాకే టు లూట్ (దేవుడి పేరుతో దోచుకుంటున్నారు)' అంటూ కామెంట్ చేశారు. చాలా మంది ఈ తరహా సేవను "అంధభక్తి" (గుడ్డి విశ్వాసం) గా అభివర్ణించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనమైన మహా కుంభమేళా 2025 పౌష్ పౌర్ణమి (జనవరి 13, 2025) నాడు ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. జనవరి 26 నుంచి గత 20 రోజులుగా త్రివేణి సంగంలో రోజుకు సగటున కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని, కుంభమేళా చరిత్రలో ఎన్నడూ చూడలేదని ప్రభుత్వం పేర్కొంది.
మొత్తం స్నానాల సంఖ్య 52.96 కోట్లు దాటింది. ఇది అధికారిక అంచనా 40 నుంచి 45 కోట్ల కన్నా 10% ఎక్కువ. మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి రోజువారీ సందర్శకులను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రవాహం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
సంబంధిత కథనం