Putin heart attack: పుతిన్ కు గుండె పోటా? .. మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారా?
Putin heart attack: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) కు తీవ్రమైన గుండపోటు (heart attack) వచ్చిందని, ఆయన అపస్మారక స్థితిలో మంచంపై పడిపోయి కనిపించారని పాశ్చాత్య మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.
Putin heart attack: పుతిన్ అనారోగ్యంపై కథనాలు రావడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. పుతిన్ తీవ్రమైన, నయం చేయలేని వ్యాధితో బాధ పడ్తున్నారని కొన్ని రోజులు, కేన్సర్ తో బాధ పడ్తున్నారని కొన్ని రోజులు, సర్జరీ జరిగిందని, అందుకే బయట కనిపించడం లేదని కొన్ని రోజులు పుతిన్ ఆరోగ్యానికి సంబంధించి పలు వార్తాకథనాలు చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా రష్యా వ్యతిరేక దేశాల మీడియాలో ఇవి ఎక్కువగా కనిపించాయి. వీటిని రష్యా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది.
గుండెపోటు..
తాజాగా మరో కథనం వెస్ట్రన్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆదివారం ఉదయం రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తీవ్రమైన గుండెపోటు (Vladimir Putin suffer a heart attack) వచ్చిందని, ఆయన తన గదిలో మంచంపై అపస్మారక స్థితిలో పడిపోయి కనిపించారని, ఆయనకు వ్యక్తిగత వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారని ఆ వార్తల సారాంశం. అందుకే పుతిన్ తన షెడ్యూల్డ్ కార్యక్రమాలను రద్దు చేసుకున్నారని అవి వివరించాయి. కాగా, ఈ వార్తలను రష్యా ఖండించింది. పుతిన్ పై వస్తున్న వందలాది పుకార్లలో ఇది ఒకటని వ్యాఖ్యానించింది. ఆ వార్త పూర్తిగా అబద్ధం, నిరాధారమని స్పష్టం చేసింది. ‘పుతిన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగాలేదన్న వార్తలు వట్టి పుకార్లు’ అని రష్యా అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్ బుధవారం స్పష్టం చేశారు.
నిజంగా అనారోగ్యంతో ఉన్నారా?
పుతిన్ అనారోగ్యంతో ఉన్నారని పాశ్చాత్య దేశాల, ముఖ్యంగా రష్యా వ్యతిరేక దేశాల ఇంటలిజెన్స్ సంస్థలు బలంగా నమ్ముతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తరువాత పుతిన్ అనారోగ్య వార్తలు మరింత విస్తృతంగా వైరల్ కావడం ప్రారంభమైంది. చివరకు, బహిరంగ కార్యక్రమాల్లో కనిపిస్తున్నది పుతిన్ కాదని, ఆయన స్థానంలో పుతిన్ లాగానే ఉండే డూప్ ను ఉపయోగిస్తున్నారన్న వార్తలు కూడా వచ్చాయి. అనారోగ్య కారణంగా, పుతిన్ తన కార్యాలయంలోనే ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్ ను సెటప్ చేసుకున్నారని కూడా కథనాలు వచ్చాయి. పుతిన్ మెదడులో సమస్య ఉందని, ఆయన సరిగ్గా మాట్లాడలేకపోతున్నారని, ఆయనకు కళ్లు కూడా సరిగ్గా కనిపించడం లేదని ఈ సంవత్సరం ఏప్రిల్ లో బ్రిటిష్ మేగజీన్ ‘మెట్రో’ ఒక కథనం ప్రచురించింది.
టాపిక్