Dense fog in North India : “ఏం కనిపించడం లేదు”- దట్టమైన పొగమంచుతో నార్త్ ఇండియా ఉక్కిరిబిక్కిరి..
Delhi fog alert : ఉత్తర భారతాన్ని దట్టమైన పొగమంచు కప్పేసింది. మరీ ముఖ్యంగా దిల్లీలో విజిబిలిటీ 0కి పడిపోయింది. ఫలితంగా దిల్లీ విమానాశ్రయంలో విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉత్తర భారతంలోని ప్రజలను ఓవైపు కోల్డ్ వేవ్, మరోవైపు దట్టమైన పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పొగమంచు కారణంగా ప్రజల రోజువారీ కార్యకలాపాలు శుక్రవారం తీవ్రంగా దెబ్బతినగా.. శనివారం కూడా అవే పరిస్థితులు కొనసాగుతున్నాయి! శనివారం తెల్లవారుజామున ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేయడంతో దిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పైగా.. అనేక ప్రాంతాల్లో దృశ్యమానత సున్నాకు పడిపోయింది.
విమాన సేవలకు తీవ్ర అంతరాయం..
ఉత్తర భారతంలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగిందని దిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (డీఐఏఎల్) అర్ధరాత్రి 12.05 గంటలకు ఒక పోస్ట్‌లో తెలిపింది. ప్రయాణికులు అప్డేటెడ్ ఫ్లైట్ సమాచారం కోసం సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని సిఫార్సు చేశారు. “ఏదైనా అసౌకర్యం కలిగితే తీవ్రంగా చింతిస్తున్నాం,” అని డీఐఏఎల్ పోస్ట్ చేసింది.
దేశ రాజధానిలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)ను డీఐఏఎల్ నిర్వహిస్తోంది. ఈ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 1,300 విమానాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
"దట్టమైన పొగమంచు కారణంగా దిల్లీ విమానాశ్రయంలో ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నాము," అని ఇండిగో ప్రకటించింది.
"#6ETravelAdvisory: విజిబిలిటీ తగ్గడం వల్ల #DelhiAirport లో డిపార్చర్, అరైవల్స్ ప్రస్తుతం నిలిచిపోయాయి," అని ఇండిగో ఎక్స్‌లో అర్థరాత్రి 1.05 గంటలకు ఒక పోస్ట్ చేసింది.
కార్యకలాపాలు పునఃప్రారంభమైన తర్వాత, రద్దీ కారణంగా విమానాలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఎయిర్‌లైన్స్ తెలిపింది.
దట్టమైన పొగమంచు కారణంగా తక్కువ దృశ్యమానత దిల్లీ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో విమాన కార్యకలాపాలను ప్రభావితం చేస్తుందని ఎయిరిండియా సంస్థ ఎక్స్‌లో అర్థరాత్రి 1.16 గంటలకు ఒక అప్డేట్ ఇచ్చింది.
దట్టమైన పొగమంచుతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. దిల్లీ, ఉత్తరప్రదేశ్, హరియాణాల్లో రోడ్లపై రాకపోకలు నత్తనడకన సాగుతున్నాయి.
దిల్లీలో వాతావరణం ఇలా..
దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో పలు ప్రాంతాల్లో దృశ్యమానత సున్నాకు పడిపోయిన విషయం తెలిసిందే.
నగరంలో గరిష్ట ఉష్ణోగ్రత 21.2 డిగ్రీల సెల్సియస్, సగటు కంటే 1.9 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది
దిల్లీ 24 గంటల సగటు ఏక్యూఐ 371గా నమోదైందని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) గణాంకాలు చెబుతున్నాయి.
వాతావరణం అనుకూలించకపోవడంతో 400కు పైగా విమానాలు ఆలస్యంగా నడిచాయని విమానాశ్రయ అధికారులు తెలిపారు.
సంబంధిత కథనం