Sexual harassment on flight: విమానంలో సహ ప్యాసెంజర్ తో అసభ్య ప్రవర్తన; ప్రయాణికుడి అరెస్ట్-delhichennai plane passenger arrested for sexual harassment on flight ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sexual Harassment On Flight: విమానంలో సహ ప్యాసెంజర్ తో అసభ్య ప్రవర్తన; ప్రయాణికుడి అరెస్ట్

Sexual harassment on flight: విమానంలో సహ ప్యాసెంజర్ తో అసభ్య ప్రవర్తన; ప్రయాణికుడి అరెస్ట్

Sudarshan V HT Telugu

బుధవారం ఢిల్లీ నుంచి చెన్నైవెళ్తున్న ఇండిగో విమానంలో లైంగిక వేధింపుల ఘటన చోటు చేసుకుంది. సహ మహిళా ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు యత్నించిన రాజస్థాన్ కు చెందిన వ్యక్తిని చెన్నైలో విమానం ల్యాండ్ అయిన తరువాత పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై లైంగిక వేధింపుల చట్టాల కింద కేసు నమోదైంది.

విమానంలో లైంగిక వేధింపులు

Sexual harassment on flight: ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో సహ ప్రయాణికురాలిపై ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. తన ముందు సీట్లో కూర్చున్న ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. విమానం చెన్నైకి చేరుకున్న తరువాత ఆ మహిళ ఫిర్యాదు చేయడంతో చెన్నై విమానాశ్రయంలో రాజస్తాన్ కు చెందిన ఆ లైంగిక వేధింపుల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిద్రిస్తుండగా అసభ్య ప్రవర్తన

ఢిల్లీ నుంచి చెన్నై వెళ్తున్న ఇండిగో విమానంలో తన సీటులో నిద్రిస్తున్న తనను తన వెనుక సీటులో కూర్చున్న నలభై మూడేళ్ల వ్యక్తి అసభ్యంగా తాకేందుకు ప్రయత్నించాడని బాధిత ప్రయాణికురాలు ఆరోపించారు. సాయంత్రం 4.30 గంటలకు విమానం ల్యాండ్ అయిన వెంటనే బాధితురాలు విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చి, నిందితుడిపై ఫిర్యాదు చేసింది.

నిందితుడి అరెస్ట్

బాధితురాలి ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంస్థ (బీఎన్ఎస్) సెక్షన్ 75 (లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇప్పటి వరకు విమానయాన సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ‘‘ఆమె విండో సీటులో కూర్చుని ఉందని, నిద్రిస్తున్న సమయంలో, ఆమె వెనుక కూర్చున్న నిందితుడు ఆమెను అనుచితంగా తాకాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది’’ అని మీనంబాక్కంలోని విమానాశ్రయానికి అనుబంధంగా ఉన్న ఆల్ ఉమెన్స్ పోలీస్ స్టేషన్ అధికారి వెల్లడించారు.

రాజస్తాన్ కు చెందిన వ్యక్తి

నిందితుడి పేరు రాజేష్ శర్మ. అతడు రాజస్థాన్ కు చెందినప్పటికీ కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటున్నాడు. వేధింపుల సమయంలో నిందితుడు 3ఏలో కూర్చున్నాడని చెన్నై విమానాశ్రయ సిబ్బంది తెలిపారు. సహ ప్రయాణికులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని మహిళలు ఫిర్యాదు చేయడం ఇదే మొదటిసారి కాదు.

గతంలో కూడా..

గతేడాది ఇండిగో (indigo) విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి తోటి ప్రయాణికురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. గువాహటి వెళ్తున్న విమానం (flight)లో క్యాబిన్ లైట్లు డిమ్ అవుతున్న సమయంలో ఆర్మ్ రెస్ట్ ను పైకి లేపి తనపై లైంగిక వేధింపులకు యత్నించాడని మహిళా ప్రయాణికురాలు తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు సదరు వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముంబై-గౌహతి మధ్య ఇండిగో విమానం 6ఈ 5319లో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడిని లైంగిక వేధింపుల ఆరోపణలపై గౌహతి పోలీసులకు అప్పగించినట్లు ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.