Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట.. 16మంది మృతి- అసలేం జరిగింది?-delhi stampede 16 people dead several injured at new delhi railway station ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట.. 16మంది మృతి- అసలేం జరిగింది?

Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట.. 16మంది మృతి- అసలేం జరిగింది?

Sharath Chitturi HT Telugu
Updated Feb 16, 2025 06:00 AM IST

Delhi stampede : న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 16మంది మృతిచెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సైతం ఉన్నారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట..
న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట.. (Hindustan Times)

మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. శనివారం రాత్రి ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రెండు రైళ్లు ఆలస్యం అవ్వడం, అనంతరం రైల్వే స్టేషన్​లో భారీ రద్దీ నెలకొనడంతో కొద్దిసేపటికే తొక్కిసలాట జరిగింది. న్యుదిల్లీ రైల్వే స్టేషన్​లో జరిగిన ఈ తొక్కిసలాటలో 16మంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గాయపడ్డారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట..

రైల్వేశాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో శనివారం రాత్రి 9:30 గంటలకు ప్లాట్​ఫామ్​ నెంబర్​ 14,15 పై ఈ ఘటన జరిగింది. మహా కుంభమేళా కోసం ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు ప్యాసింజర్లు రైళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. రద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.

కొద్దసేపటికే ప్యాసింజర్ల తాకిడి మరింత పెరగడంతో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో అనేక మంది స్పృహకోల్పోయి కిందపడిపోయారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 16మంది మరణించగా, వీరిలో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. అనేకమంది గాయపడ్డారు.

సీట్లు ఉండవేమో అన్న భయంతో భారీ సంఖ్యలో ప్రజలు ఒకేసారి రైళ్లల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

ఘటనాస్థలానికి పరుగులు తీసిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నాలుగు అగ్నిమాపక సిబ్బంది సైతం రైల్వే స్టేషన్​కి చేరుకుని అధికారులకు సాయం చేసింది. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే, 1500కిపైగా జనరల్​ టికెట్లు విక్రయించడం ఈ రద్దీకి కారణం అని తెలుస్తోంది!

"ప్రయాగ్​రాజ్​ ఎక్స్​ప్రెస్​ ప్లాట్​ఫామ్​ నెం. 14పైకి వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్​ఫామ్​పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్​ప్రెస్​, భువనేశ్వర్​ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైళ్లు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్​ఫాం నెం. 12,13,14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కిపైగా జనరల్​ టికెట్లు విక్రయించినట్టు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, నియంత్రించలేని విధంగా మారినట్టు సమాచారం," అని రైల్వే డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ కేపీఎస్​ మల్హోత్రా తెలిపారు.

ప్రభుత్వ వైఫల్యమే కారణమా?

న్యూదిల్లీ తొక్కిసలాట ఘటనపై హై లెవల్​ కమిటీ దర్యాప్తు చేపట్టినట్టు రైల్వేశాఖ వెల్లడించింది.

దిల్లీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి ఎల్​ఎన్​జీపీ హాస్పిటల్​ని సందర్శించి, తొక్కిసలాటలో గాయపడిన వారిని పరామర్శించారు.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు.

"న్యూదిల్లీ రైల్వేస్టేషన్​లో జరిగిన తొక్కిసలాట వార్త విని దిగ్భ్రాంతి చెందాను. ఈ ఘటనలో ప్రాణాలు కల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి. తొక్కిసలాటలో ప్రభావితమైన వారికి అధికారులు సాయం చేస్తున్నారు," అని ట్వీట్​ చేశారు మోదీ.

మరోవైపు న్యూదిల్లీ రైల్వేస్టేషన్​లో తొక్కిసలాట ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. దేశంతో పాటు యూపీలో అధికారంలో ఉన్న బీజేపీ వైఫల్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆప్​, కాంగ్రెస్​లు ఆరోపించాయి. ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు సరైన ఏర్పాట్లు చేయడం లేదని, అందుకే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు.

మహా కుంభమేళాకు భారీ తాకిడి..

మహా కుంభమేళా 2025 నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్​ స్టాండ్​లు, విమానాశ్రయాలు కిటకిటిలాడిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రైళ్లు, రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ కనిపిస్తోంది.

ఫిబ్రవరి 14 నాటికి 50కోట్లకు పైగా మంది భక్తులు మహా కుంభమేళాలో పవిత్ర స్నానాలు చేశారు. శనివారం ఉదయం 6 గంటల నాటికి ప్రయాగ్​ రైల్వే స్టేషన్​ నుంచి వెళ్లిన వారి సంఖ్య దాదాపు 3లక్షలకు చేరుకుంది.

కాగా శుక్రవారం ఒక్కరోజే ప్రయాగ్​రాజ్​ నుంచి 328 రైళ్లల్లో 10.47 లక్షల మంది ప్రయాణించారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.