ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి దిల్లీలోని పలు ప్రాంతాలు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లోని కొన్ని ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు ఆదివారం ఉదయం దిల్లీలో 21.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భారీ ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశం ఉందని దిల్లీ, పరిసర ప్రాంతాలకు ఐఎండీ శనివారం రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది.
భారీ వర్షాల కారణంగా ఏర్పడిన అంతారాయానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని చోట్ల నీటి మట్టాలు పెరిగి చిన్న వాహనాలను ముంచెత్తాయి.
మింటో రోడ్లో ఒక కారు దాదాపు పూర్తిగా నీటి అడుగున కనిపించడంతో ఆ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంపై ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేశారు.దిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 సమీపంలో రోడ్లు నీటి కాలువలను తలపించడంతో ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బందికి రాకపోకలు కష్టంగా మారాయి. మోతీబాగ్ ప్రాంతంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
రాత్రి కురిసిన వర్షానికి వీధులు భారీగా జలమయం కావడంతో ఆదివారం తెల్లవారుజామున ధౌలా కువాన్‌లో ట్రాఫిక్ నెమ్మదిగా సాగింది. ప్రధాన రహదారులపై నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐఏ)లో ఆదివారం ఉదయం విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ Flightradar24.com డేటా ప్రకారం.. అనేక డిపార్చర్లు ఆలస్యం అయ్యాయి. కొన్ని విమానాలు రద్దు అయ్యాయి. అవుట్ గోయింగ్ విమానాల సగటు ఆలస్యం 30 నిమిషాలకు మించి ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి.
తక్కువ విజిబిలిటీ, తడి రన్ వేలు తాత్కాలిక ఎయిర్ సైడ్ రద్దీకి దోహదపడ్డాయి. దిల్లీలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు విమానాల రాకపోకలకు తాత్కాలిక అంతరాయం కలిగించాయని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉదయం 3:59 గంటలకు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. స్పష్టమైన ఆకాశంతో సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని ఉదయం 5:54 గంటలకు ఎయిర్లైెన్స్ అప్డేట్ చేసింది.
గత వారం ఇదే వాతావరణ పరిస్థితులు దిల్లీలోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయాలకు దారితీశాయి. బవానా, నరేలా, జహంగీర్ పురి, సివిల్ లైన్స్, శక్తి నగర్, మోడల్ టౌన్, వజీరాబాద్, ధీర్ పూర్, బురారీ ప్రాంతాల్లో దుమ్ము తుఫాను, వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
నైరుతి రుతుపవనాలు శనివారం కేరళలోకి ప్రవేశించాయని ఐఎండీ ధృవీకరించింది. ఇంత త్వరగా రుతుపవనాలు దేశంలోకి రావడం 2009 తర్వాత తొలిసారి.
ఈ నేపథ్యంలో కేరళలో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోని అనేక చోట్ల వాతావరణం చల్లబడిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.
సంబంధిత కథనం