Delhi poll: ఆప్ ప్రచార పోస్టర్ లో రాహుల్ గాంధీ చిత్రం; అవినీతి నేతల జాబితాలో చోటు
Delhi poll: కాంగ్రెస్, ఆప్ లు జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ప్రత్యర్థులుగా హోరాహోరీగా తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ విడుదల చేసిన అవినీతిపరులైన నేతల జాబితాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిత్రాన్ని కూడా పొందుపర్చారు.
Delhi poll: ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో, ప్రధాన పార్టీలైన ఆప్, బీజేపీ, కాంగ్రెస్ లు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా, శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రచార పోస్టర్ ను విడుదల చేసింది. అందులో దేశంలోని అవినీతిపరులైన నాయకుల చిత్రాలను ప్రచురించింది. వాటిలో జాతీయ స్థాయిలో మిత్రపక్షమైన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చిత్రం కూడా ఉండడం గమనార్హం.

పోటాపోటీగా..
ఢిల్లీలో ఆప్, ప్రతిపక్ష బీజేపీ కొంతకాలంగా వినూత్న ప్రచార ఇతివృత్తాలను ఉపయోగిస్తున్నాయి. కానీ, జాతీయ స్థాయిలో మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని, అతడిని నిజాయితీ లేని నాయకుల జాబితాలో ఆప్ చేర్చడం ఇదే తొలిసారి. లోక్ సభ ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో ఏర్పడిన విపక్ష కూటమి ‘ఇండియా’ లో కాంగ్రెస్, ఆప్ లు కీలక భాగస్వామ్య పక్షాలన్న విషయం తెలిసిందే. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు వేరువేరుగా పోటీ చేస్తున్నాయి.
జాబితాలో పీఎం మోదీ
ఆప్ అవినీతి నాయకుల జాబితాలో రాహుల్ గాంధీ (rahul gandhi) తో పాటు ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi), హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర బిజెపి నాయకులు రమేష్ బిధురి, ఢిల్లీ యూనిట్ చీఫ్ వీరేంద్ర సచ్దేవా వంటి ఇతర బిజెపి నాయకులు కూడా ఉన్నారు. అలాగే ఆ పోస్టర్ లో ‘కేజ్రీవాల్ నిజాయితీ అవినీతిపరులను ఎదుర్కొంటుంది’ అనే నినాదాన్ని కూడా పొందుపర్చారు.
కాంగ్రెస్ కు లభించని మిత్రపక్షాల మద్ధతు
జాతీయ స్థాయిలో విపక్ష కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆప్ లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతున్నాయి. మిత్రపక్షాలైన శివసేన (యూబీటీ), సమాజ్ వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ లు కూడా ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను కాదని, ఆప్ (AAP) కే మద్దతు ప్రకటించాయి. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదికలను ఢిల్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంలో జాప్యం, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణాలను ఉదహరిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహిస్తోంది.
మాటల యుద్ధం
కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా శనివారం కేజ్రీవాల్ (arvind kejriwal) కు విపక్ష కూటమి ఇండియా నుంచి వైదొలగాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ 100 మంది ఎంపీలతో బలంగా ఉందని, మొత్తం 7 సీట్లను బీజేపీకి ఇచ్చింది అరవింద్ కేజ్రీవాలేనని అల్కా లాంబా అన్నారు. ‘‘లోక్ సభ ఎన్నికల (lok sabha elections 2024) సమయంలో పొత్తు కోసం మీరు (కేజ్రీవాల్) మా ముందు భిక్షాటన చేశారు. ఢిల్లీలో 7 సీట్ల కోసం మీ పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ పెద్ద తప్పు చేసింది. దీని వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది’’ అని లాంబా ఆరోపించారు. ఢిల్లీలో బీజేపీతో కాంగ్రెస్ రహస్య పొత్తు పెట్టుకుందని ఆప్ ఆరోపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ (CONGRESS) పార్టీ బీజేపీ నుంచి డబ్బులు తీసుకుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ ఆరోపించారు. బీజేపీ నల్లధనం పంపిణీ, ఓటరు చేర్పు-తొలగింపు అంశంపై కాంగ్రెస్ పార్టీ మౌనం వహిస్తోందన్నారు. బీజేపీ (BJP) చేస్తున్న నల్ల చేష్టలపై మౌనం వహిస్తున్నారు. బీజేపీతో తమ అపవిత్ర పొత్తును కాంగ్రెస్ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
టాపిక్