Delhi ordinance bill: వైఎస్సార్సీపీ, బీజేడీలపై ‘ఇండియా’ ఎంపీల విమర్శలు
Delhi ordinance bill: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు మద్దతివ్వడంతో వైఎస్సార్సీపీ, బీజేడీలపై ‘ఇండియా’ ఎంపీలు విమర్శలు గుప్పించారు. ఆ బిల్లులో వారికి అంతగా నచ్చిన అంశాలేమిటో అర్థం కాలేదని కాంగ్రెస్ ఎంపీ చిదంబరం వ్యాఖ్యనించారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ, ఒడిశాలో బీజేడీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే.
Delhi ordinance bill: ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కత్తిరించే విధంగా రూపొందించిన ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని వైఎస్సార్సీపీ, బీజేడీ నిర్ణయించుకున్న నేపథ్యంలో విపక్ష కూటమి ‘ఇండియా’ ఎంపీలు ఆ రెండు పార్టీలపై విమర్శలు గుప్పించాయి. ఈ రెండు పార్టీల మద్దతుతో రాజ్యసభలో ఈ బిల్లు సునాయాసంగా విజయం సాధిస్తుంది.
ఏ అవసరాలు ఉన్నాయో..
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుకు వైఎస్సార్సీపీ, బీజేడీ మద్దతు ఇవ్వడంపై ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా స్పందించారు. ఆ బిల్లుకు మద్దతు ఇచ్చేవారు చరిత్రలో యాంటీ నేషనల్స్ గా నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. ఈ బిల్లును సమర్ధిస్తున్న ప్రాంతీయ పార్టీలకు వేరే అవసరాలు ఉండి ఉండొచ్చని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘తప్పనిసరై ఆ పార్టీలు ఆ బిల్లుకు మద్దతు ఇస్తుండవచ్చు’ అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ‘‘వైఎస్సార్సీపీ, బీజేడీ లు తమ రాజకీయ అవసరాల కోసం పార్లమెంట్లో బీజేపీని సమర్ధిస్తున్నాయి కావచ్చు.. కానీ సమయం వచ్చినప్పుడు రాష్ట్రాల్లో వేరే పార్టీల ప్రభుత్వాలను కూలదోసే అవకాశం వచ్చినప్పుడు.. బీజేపీ తన, పర అని భావించదు. ఎవరినీ వదిలేయదు’’ అని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ వ్యాఖ్యానించారు.
ఏం మంచి కనిపించింది?
ఆ బిల్లుకు మద్దతిచ్చిన వైఎస్సార్సీపీ, బీజేడీ పార్టీలపై కాంగ్రెస్ ఎంపీ పీ చిదంబరం మండిపడ్డారు. ఆ బిల్లుకు వారు ఎందుకు మద్దతు ఇస్తున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఆ బిల్లులో వారికి ఏం మంచి కనిపించింది? అని ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రి, మరో ఇద్దరు అధికారులు సభ్యులుగా ఉన్న ఒక కమిటీకి ఢిల్లీ వ్యవహారాలపై అధికారం అప్పగించడం సరైనదే అని ఆ పార్టీలు భావిస్తున్నాయా?.. ముఖ్యమంత్రితో సంబంధం లేకుండానే కేంద్రం నియమించిన ఆ ఇద్దరు అధికారులు నిర్ణయాలు తీసుకోవడం ఆ పార్టీలకు కరెక్టే అనిపిస్తోందా? ’’ అని చిదంబరం ఒక ట్వీట్ లో ప్రశ్నించారు.