Next Delhi CM: ఈ ఐదుగురు బీజేపీ నేతల్లో ఢిల్లీ సీఎం అయ్యేదెవరు?-delhi next cm who among these five bjp leaders is going to become the delhi cm ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Next Delhi Cm: ఈ ఐదుగురు బీజేపీ నేతల్లో ఢిల్లీ సీఎం అయ్యేదెవరు?

Next Delhi CM: ఈ ఐదుగురు బీజేపీ నేతల్లో ఢిల్లీ సీఎం అయ్యేదెవరు?

Sudarshan V HT Telugu
Published Feb 08, 2025 02:49 PM IST

Delhi Next CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమైన నేపథ్యంలో, ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరిని బీజేపీ ఎంపిక చేయనుందనే విషయంపై పడింది. ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ఐదుగురు నేతలు ఉన్నారు. వారిలో అధిష్టానం ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాలి.

పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ
పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ (PTI)

Delhi Next CM: 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తోంది. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆప్ ను ఓడించి బీజేపీ పవర్ లోకి వస్తోంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఖాయమని కౌంటింగ్ ట్రెండ్స్ సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇప్పుడు చర్చ బీజేపీ తరఫున ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు రానున్నారనే విషయంపై నడుస్తోంది.

రేసులో ఐదుగురు

ఢిల్లీ సీఎం రేసులో ప్రస్తుతం ఐదుగురు నేతలు ఉన్నారు. వారిలో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించిన పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, సీఎం ఎంపిక అధిష్టానం చేతిలో ఉందని, బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించే వ్యక్తి సీఎం అవుతారని ఢిల్లీ బీజేపీ నేతలు చెబుతున్నారు.

పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ

న్యూఢిల్లీ స్థానంలో ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఓడించిన తర్వాత మాజీ ఎంపి పర్వేష్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ బీజేపీకి ప్రముఖ వ్యక్తిగా మారారు. ఢిల్లీ మాజీ సిఎం సాహిబ్‌ సింగ్‌ వర్మ కుమారుడు. ఈ విజయంతో "జెయింట్‌ కిల్లర్‌" అనే బిరుదును పర్వేశ్ వర్మ సంపాదించారు. ఎందుకంటే అతను కేజ్రీవాల్‌ కోటను బద్ధలు కొట్టగలిగాడు.

విజేందర్ గుప్తా

బీజేపీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న విజేందర్ గుప్తా కూడా సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన 2015, 2020 అసెంబ్లీ ఎన్నికల్లో రోహిణి స్థానం నుంచి విజయం సాధించి, 2025 లో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆప్ ఆధిపత్యం ఉన్నప్పటికీ 2015, 2020 ఎన్నికల్లో గెలిచారు. గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. అతని అనుభవం, చొరవల కారణంగా ఆయన బీజేపీలో కీలక వ్యక్తిగా నిలిచారు.

మజీందర్ సింగ్ సిర్సా

రాజౌరి గార్డెన్ విధానసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించబోతున్న మజీందర్ సింగ్ సిర్సా కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ నుంచి ఢిల్లీని కైవసం చేసుకున్న తర్వాత బీజేపీ ఇప్పుడు పంజాబ్ పై దృష్టి సారించినందున.. పంజాబ్ మూలాలున్న మజీందర్ సింగ్ సిర్సా ఢిల్లీలో ముఖ్యమంత్రి పదవికి సరైన వ్యక్తి అని బీజేపీ అధిష్టానం భావించే అవకాశం ఉంది.

దుష్యంత్ గౌతమ్

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత నాయకుడు దుష్యంత్ గౌతమ్ కూడా ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి పోటీలో ఉన్నారు. కరోల్ బాగ్ స్థానంలో ఆప్ తరపున విశేష్ రవికి వ్యతిరేకంగా ఆయన పోటీ చేశారు. ఢిల్లీలో మద్దతు ఉన్న ముఖ్యమంత్రి అభ్యర్థులలో ఆయన ఒకరు.

హరీష్ ఖురానా

మోతీ నగర్ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. హరీశ్ ఖురానా 1993 నుండి 1996 వరకు ఢిల్లీ మూడవ ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ బిజెపి నాయకుడు మదన్ లాల్ ఖురానా కుమారుడు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల అరంగేట్రం చేస్తున్నారు. ఖురానా బీజేపీ ఢిల్లీ యూనిట్ కార్యదర్శిగా పనిచేశారు. ఆయన ప్రజా సంబంధాల సెల్ మాజీ కన్వీనర్, ఢిల్లీ బీజేపీ ప్రతినిధి కూడా.

Whats_app_banner
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.