Instagram lover: ‘‘ఇన్స్టాగ్రామ్ లవర్ ను పెళ్లి చేసుకోవడం కోసం కన్న కూతురినే చంపేసింది’’
Instagram lover: ఒక తల్లి తన కన్నబిడ్డనే గొంతు నులిమి చంపేసింది. ఐదేళ్ల చిన్నారిని కనికరం లేకుండా హత్య చేసింది. ఇన్ స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసం ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.
Delhi crime news: ఇన్ స్టాగ్రామ్ లో తనకు పరిచయమైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు అడ్డుగా ఉందని ఓ మహిళ తన ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపేసింది. తన బిడ్డను ఆ వ్యక్తి కుటుంబం అంగీకరించలేదని, బిడ్డ ఉంటే పెళ్లి చేసుకోవడం కుదరదని ఆ వ్యక్తి చెప్పడంతో, మనస్తాపానికి గురై ఐదేళ్ల తన కూతురిని గొంతు నులిమి చంపేశానని ఆ తల్లి పోలీసుల ముందు ఒప్పుకుంది.
హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చి..
ఆ యువతి కొన్నాళ్ల క్రితం వరకు హిమాచల్ ప్రదేశ్ లో ఉండేది. అక్కడే ఆమెకు వివాహమైంది. కూతురు పుట్టిన తరువాత ఆమె భర్త వారిని వదిలేసి వెళ్లిపోయాడు. ఆ తరువాత ఆమెకు ఢిల్లీకి చెందిన రాహుల్ అనే వ్యక్తితో ఇన్ స్టా గ్రామ్ (INSTAGRAM) లో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. దాంతో, ఆమె ఢిల్లీకి మకాం మార్చింది. వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్ లో నివాసం ఉంటోంది. అయితే, రాహుల్ కుటుంబం బిడ్డతో వచ్చిన ఆమెను అంగీకరించలేదు. ఆమెతో వివాహాన్ని వారు తిరస్కరించారు. దాంతో, ఆవేదనకు గురైన ఆ యువతి, తన పెళ్లికి అడ్డుగా ఉందన్న కోపంతో తన ఐదేళ్ల కుమార్తెను గొంతు నులిమి చంపేసింది.
డాక్టర్లు అనుమానించడంతో..
కోపంలో గొంతు నులమడంతో ఆ బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లింది. దాంతో, ఆ చిన్నారిని తీసుకుని ఢిల్లీలోని దీప్ చంద్ బంధు ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడి వైద్యులు బాలిక అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు. ఆమె మెడపై ఉన్న గుర్తులను బట్టి అనుమానించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని, బాలిక మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించారు. అనంతరం, ఆ తల్లిని ప్రశ్నించడంతో, ఆమె తల్లి కన్నీరుమున్నీరుగా ఏడుస్తూ, అసలు విషయం చెప్పింది.