Delhi MCD Election Results: ఢిల్లీ కార్పొరేషన్ ఫలితాలు నేడే.. ఉత్కంఠలో ఆప్, బీజేపీ-delhi mcd election results today vote counting will begin at 8 am ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Mcd Election Results Today Vote Counting Will Begin At 8 Am

Delhi MCD Election Results: ఢిల్లీ కార్పొరేషన్ ఫలితాలు నేడే.. ఉత్కంఠలో ఆప్, బీజేపీ

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 07, 2022 07:04 AM IST

Delhi MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు జరగనుంది. ఫలితాలు కూడా వెల్లడవుతాయి. ఆమ్‍ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉంది.

Delhi MCD Election Results: ఢిల్లీ కార్పొరేషన్ ఫలితాలు నేడే
Delhi MCD Election Results: ఢిల్లీ కార్పొరేషన్ ఫలితాలు నేడే (PTI)

Delhi MCD Election Results 2022: మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ( Municipal Corporation of Delhi - MCD) ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు (డిసెంబర్ 7) జరగనుంది. ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. సాధారణ ఎన్నికలను తలపిస్తూ దేశ రాజధానిలో ఈ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. 250 వార్డులకు గాను ఈనెల 4వ తేదీన పోలింగ్ జరిగింది. మొత్తంగా 1,349 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నేటి ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు (MCD Election Vote Count) మొదలుకానుంది. ఢిల్లీ కార్పొరేషన్‍ను ఆమ్‍ఆద్మీ కైవసం చేసుకుంటుందని, బీజేపీ రెండో స్థానానికి చేరుతుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాగా, MCD ఎన్నికల ఓట్ల లెక్కింపు గురించి మరిన్ని వివరాలు చూడండి.

ట్రెండింగ్ వార్తలు

పటిష్ట భద్రత

Delhi MCD Election Results 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపు 42 కేంద్రాల్లో జరుగుగుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం పటిష్ట భద్రత ఏర్పాటు చేసింది. 10,000 మంది పోలీసులు, 22 కంపెనీల పారా మిలటరీ సిబ్బంది భద్రతా విధుల్లో ఉంటారు. రాజకీయ పార్టీల కార్యాలయాల వెలుపల కూడా గట్టి సెక్యూరిటీ ఉండనుంది.

ఆప్ తొలిసారి రానుందా!

Delhi MCD Election Results: 2007 నుంచి నుంచి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍.. బీజేపీదే చేతుల్లోనే ఉంది. ఆమ్‍ఆద్మీ పార్టీ.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తూ అధికారంలో కొనసాగుతున్నా.. ఎంసీడీపై పట్టు సాధించలేదు. 2017 ఎన్నికల్లో 270 వార్డులు ఉండగా.. బీజేపీ 181 సీట్లు గెలిచింది. ఆమ్‍ఆద్మీ 48 చోట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ 30 చోట్ల గెలిచింది. అయితే, ఈసారి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ పీఠం ఆమ్‍ఆద్మీ పార్టీకి తొలిసారి దక్కనుందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చాయి. ఆప్‍కు స్పష్టమైన మెజారిటీ వస్తుందని స్పష్టం చేశాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు ఇదే ఫలితాలను వెల్లడించాయి.

మరోవైపు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వెల్లడి తర్వాత ఆమ్‍ఆద్మీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) స్పందించారు. తమ విజయం ఖాయమని, ఢిల్లీ ప్రజలకు అభినందనలు తెలిపారు. అయితే ఫలితాల కోసం వేచిచూస్తున్నామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే వస్తాయని ఆశాభావం వ్యక్త చేశారు. కేజ్రీవాల్ సుపరిపాలననే ప్రజలు ఎన్నుకుంటారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనిశ్ సిసోడియా చెప్పారు.

మరోవైపు బీజేపీ కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా తుది ఫలితాలు వస్తాయని, ఎంసీడీని బీజేపీ మళ్లీ చేజిక్కించుకుంటుందని ఆ పార్టీ ఢిల్లీ జనరల్ సెక్రటరీ దినేశ్ ప్రతాప్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు ఏవైనా ప్రజాతీర్పును గౌరవిస్తామని చెప్పారు.

WhatsApp channel