Delhi Mayor election 2023: ఎట్టకేలకు ఢిల్లీకి మేయర్.. ‘ఆప్’కే పీఠం.. “గూండాలు ఓడారు”: కేజ్రీవాల్
Delhi Mayor election 2023: ఢిల్లీ మేయర్ పీఠం ఆమ్‍ఆద్మీ పార్టీ కైవసం అయింది. మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi ) ఎన్నికయ్యారు. బీజేపీ అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు.
Delhi Mayor election 2023: మూడుసార్లు ఎన్నిక వాయిదా, గొడవలు, విమర్శలు, వివాదాల తర్వాత ఎట్టకేలకు ఢిల్లీకి మేయర్ వచ్చారు. ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party - AAP)కి చెందిన షెల్లీ ఒబెరాయ్ (Shelly Oberoi).. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) మేయర్‌గా ఎన్నికయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation of Delhi) హౌస్‍లో బుధవారం మేయర్ ఎన్నిక జరిగింది. భారతీయ జనతా పార్టీ (BJP) అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ 34 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. దీంతో ఢిల్లీ మేయర్ పీఠం.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఆప్ వశమైంది. మేయర్ ఎన్నిక కోసం సమావేశం జరగడం ఇది నాలుగోసారి. గత మూడుసార్లు ఆప్, బీజేపీ మధ్య గొడవలతో మేయర్ ఎన్నిక జరగలేదు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు తీర్పు తర్వాత నాలుగోసారి ఎన్నిక తంతు పూర్తయింది. పూర్తి వివరాలు ఇవే.
ఆమ్ఆద్మీకి 150 ఓట్లు
Delhi Mayor election 2023: ఢిల్లీ మేయర్ ఎన్నికలో 242 మంది కౌన్సిలర్లు, 10 మంది ఎంపీలు, 14 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. మొత్తంగా 266 ఓట్లు పోలయ్యాయి. ఇందులో ఆమ్ఆద్మీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ 150 ఓట్లు సాధించారు. బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాకు 116 వచ్చాయి. దీంతో మేయర్‌గా షెల్లీ ఒబెరాయ్ ఎన్నికయ్యారని అధికారులు ప్రకటించారు.
15ఏళ్ల తర్వాత..
Delhi Mayor election 2023: 15 సంవత్సరాలుగా ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‍ను బీజేపీనే పరిపాలిస్తోంది. 2007 నుంచి బీజేపీకి చెందిన వారే మేయర్‌గా ఉంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ఆద్మీ.. బీజేపీకి మేయర్ పీఠాన్ని దూరం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్‍ను కూడా కేజ్రీవాల్ సేన కైవసం చేసుకుంది.
గూండాలు ఓడారు
Delhi Mayor election 2023: ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో గూండాలు ఓడారంటూ బీజేపీపై పరోక్ష దాడి చేశారు ఢిల్లీ సీఎం, ఆమ్‍ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్. “ నేడు జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ ఎన్నికలో ఢిల్లీ ప్రజలు గెలిచారు. గూండాయిజం, గూండాలు (Goons) ఓటమి పాలయ్యారు” అని పేర్కొన్నారు.
సుప్రీం తీర్పు తర్వాత..
Delhi Mayor election 2023: లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన కౌన్సిలర్లు కూడా మేయర్ ఎన్నికలో ఓటు వేయవచ్చని తెచ్చిన నిబంధనపై గత సమావేశంలో ఆమ్ఆద్మీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై గొడవ జరగగా.. మూడోసారి కూడా మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ఆమ్ఆద్మీ పార్టీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించింది. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన కౌన్సిలర్లు మేయర్ ఎన్నికలో ఓటు వేసేందుకు వీలులేదంటూ సుప్రీం తీర్పు చెప్పింది. దీంతో ఆమ్ఆద్మీ ఊపిరిపీల్చుకుంది. ఎట్టకేలకు నాలుగోసారి జరిగిన సమావేశంలో మేయర్ ఎన్నిక విజయవంతంగా జరిగింది. ఆప్‍కే మేయర్ పదవి దక్కింది.
ఎన్నికల్లో ఆప్ హవా
MCD Polls: గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 250 వార్డులకు ఎన్నిక జరిగింది. 134 స్థానాల్లో ఆమ్ఆద్మీ పార్టీ విజయం సాధించింది. మేయర్ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు కావాల్సిన మెజార్టీని సాధించింది. బీజేపీ 104 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థులు 9 చోట్ల విజయం సాధించారు.