Delhi High Court: ‘తల్లీ, కొడుకులు కలవడం కదా ఇక్కడ ముఖ్యం’-delhi hc reunites 3 yr old with ukrainian mom ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Hc Reunites 3-yr-old With Ukrainian Mom

Delhi High Court: ‘తల్లీ, కొడుకులు కలవడం కదా ఇక్కడ ముఖ్యం’

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 05:25 PM IST

Delhi High Court: ఉక్రెయిన్ నుంచి తన మాజీ భర్త తమ కొడుకును తనకు తెలియకుండా భారత్ కు తీసుకువచ్చాడని, తన కుమారుడిని కలపాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ హైకోర్టు

Delhi High Court: ‘‘తన కుమారుడి కోసం ఒక తల్లి, కూతురితో పాటు ఉక్రెయిన్ నుంచి భారత్ వచ్చింది. ముందు వారిని కలవనివ్వండి. కాసేపు సంతోషంగా గడపనివ్వండి. ఆ మూడున్నరేళ్ల పిల్లవాడి చుట్టూ సంతోష వాతావరణం ఉండేలా చూడండి’’ అని మంగళవారం ఢిల్లీ హై కోర్టు వ్యాఖ్యానించింది.

ట్రెండింగ్ వార్తలు

Ukraine mother in Delhi High court: ఉక్రెయిన్ నుంచి భారత్ కు..

కేసు వివరాల్లోకి వెళితే… ఉక్రెయిన్ మహిళ తన భర్తతో ఉక్రెయిన్ లో విడాకులు తీసుకుంది. ఉక్రెయిన్ లోని కోర్టు విడాకులు మంజూరు చేస్తూ.. మైనర్లైన వారి కుమారుడు, కూతురి సంరక్షణ బాధ్యతను తల్లికి అప్పగించింది. పిల్లలను చూసి, కాసేపు గడిపే అవకాశం ఆ తండ్రికి కల్పించింది. దాంతో ఆ తండ్రి అప్పుడప్పుడు వచ్చి పిల్లలతో కాసేపు సమయం గడిపి వెళ్తుండేవాడు.

Russia-Ukraine war: యుద్ధ సమయంలో..

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత.. ఒక రోజు వారి ఇంటికి వచ్చిన ఆ తండ్రి.. మూడున్నరేళ్ల వారి కొడుకును వాకింగ్ కని బయటకు తీసుకువచ్చి, మళ్లీ తిరిగి వెళ్లలేదు. ఆ తల్లి తన కుమారుడి కోసం వెతికగా, ఆ మూడున్నరేళ్ల పిల్లవాడితో పాటు ఆ తండ్రి ఇండియా వెళ్లిపోయినట్లు గుర్తించింది. దాంతో ఆమె తన కూతురిని తీసుకుని ఢిల్లీ వచ్చింది. ఇక్కడ ఒక లాయర్ సహాయంతో ఢిల్లీ హైకోర్టులో ‘హెబియస్ కార్పస్’ పిటిషన్ వేసింది. దాంతో, కోర్టు ఆ పిల్లవాడిని, అతడి తండ్రిని సాధ్యమైనంత త్వరగా కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను ఆదేశించింది. మంగళవారం పోలీసులు వారిని కోర్టు లో హాజరుపర్చారు.

Delhi High Court comments:సంతోషంగా గడపనివ్వండి..

ఈ సందర్భంగా అనవసర వాదనలు చేస్తున్న ఇరు వర్గాల లాయర్లను కోర్టు మందలించింది. ప్రస్తుత కేసు ఆ పిల్లవాడు ఎవరికి చెందుతాడనే విషయానికి సంబంధించినది కాదని, పిల్లవాడిని తన తల్లి, అక్క చెంతకు చేర్చడానికి సంబంధించినదని వ్యాఖ్యానించింది. ‘కోర్టు సమయం ముగిసే వరకు వారిని కోర్టు క్రెచ్ లో సంతోషంగా కలిసి ఉండనివ్వండి. ఆ మూడున్నరేళ్ల పిల్లవాడికి సంతోషం కలిగేలా చూడండి. ఆ చిన్నారి పిల్లవాడు ఇప్పటికే తల్లికి దూరమైన బాధలో ఉన్నాడు. వారిని కాసేపు సంతోషంగా గడవనివ్వండి. మిగతా విషయాలపై చర్చ ఇప్పుడు అవసరం లేదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. తన కుమారుడిని తనకు చూపించాలన్న అభ్యర్థనతో పాటు, తన మాజీ భర్తపై కిడ్నాప్, సరైన పత్రాలు లేకుండా మైనర్ ను భారత్ కు తీసుకువచ్చిన నేరం, తప్పుడు ఇండియన్ పాస్ పోర్ట్ ను రూపొందించడం.. వంటి నేరాలపై కేసు నమోదు చేసేలా ఢిల్లీ పోలీసులు లేదా సీబీఐని ఆదేశించాలని ఆ మహిళ కోర్టును అభ్యర్థించింది.

IPL_Entry_Point

టాపిక్