ED summons CM Kejriwal: కేజ్రీవాల్ ను వదలని ఈడీ; నాలుగో సారి సమన్లు
ED summons CM Kejriwal: ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను వదలడం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి శనివారం వరుసగా నాలుగో సారి సమన్లు జారీ చేసింది.
ED summons CM Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు నాలుగోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈడీ సమన్లపై గతంలో స్పందించిన అరవింద్ కేజ్రీవాల్ తాను సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే తనను అరెస్టు చేయడమే ఈడీ ఉద్దేశమని చెప్పారు.
ఎక్సైజ్ పాలసీ కేసు
2021-22 లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ దర్యాప్తులో విచారణకు జనవరి 18న తమ ముందు హాజరుకావాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా సమన్లు జారీ చేసింది. గత వారం ఈడీ పంపిన మూడో సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదు. కేజ్రీవాల్ పదేపదే సమన్లను పట్టించుకోకపోవడం కేసు దర్యాప్తును దెబ్బతీస్తోందని ఈడీ భావిస్తోంది.
నాలుగో సారి..
విధాన రూపకల్పన, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi excise policy scam) ఖరారుకు ముందు జరిగిన సమావేశాలు, లంచాల ఆరోపణలపై కేజ్రీవాల్ ను ప్రశ్నించాలనుకుంటున్నట్లు ఈడీ తెలిపింది. 2023 లోనవంబర్ 2న, డిసెంబర్ 22న జారీ చేసిన రెండు సమన్లను కేజ్రీవాల్ పట్టించుకోలేదని, అవి చట్టవిరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్నారు. ఈ విధంగా అక్రమంగా వచ్చిన రూ. 45 కోట్ల డబ్బును ఆప్ గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వాడుకుందని ఈడీ ఆరోపిస్తోంది. ఎక్సైజ్ విధానంలో వచ్చిన లంచాలను గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించారని ఈడీ గతంలో ఆరోపించినప్పటికీ, ముడుపుల మొత్తాన్ని ఏజెన్సీ పేర్కొనడం ఇదే మొదటిసారి. అలాగే, ఆప్ ను ప్రత్యక్ష లబ్ధిదారుగా పేర్కొనడం కూడా ఇదే తొలిసారి.
మొత్తం 100 కోట్లు..
ఎక్సైజ్ పాలసీకి సంబంధించి ఆప్ నేతలకు మొత్తం రూ.100 కోట్ల వరకు ముడుపులు (liquor scam) అందినట్లు ఈడీ పేర్కొంది. డిసెంబర్ 2న దాఖలు చేసిన ఛార్జిషీటులో "కొంతమంది ఆప్ నాయకులు వ్యక్తిగతంగా కూడా ప్రయోజనం పొందారు" అని ఈడీ ఆరోపించింది. జైలులో ఉన్న ఆప్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు రూ.2.2 కోట్లు, ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇంచార్జ్ విజయ్ నాయర్ కు రూ.1.5 కోట్లు, సంజయ్ సింగ్ కు రూ.2 కోట్ల నగదును వ్యాపారవేత్త దినేశ్ అరోరా చెల్లించినట్లు పేర్కొంది.
కుట్రలో భాగంగానే..
అక్రమ నిధులను నిరంతరం తమకు, ఆప్ కు మళ్లించడానికి ఆప్ నేతలు చేసిన కుట్రలో భాగంగానే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22ను రూపొందించినట్లు ఇప్పటివరకు జరిగిన పీఎంఎల్ ఏ (ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, 2002) దర్యాప్తులో వెల్లడైందని చార్జిషీట్ లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఎక్సైజ్ పాలసీ కేజ్రీవాల్ సొంత ఆలోచనయేనని ఈడీ తన ఐదు ఛార్జీషీట్లలో పేర్కొంది. రిమాండ్ పత్రాల్లో కేజ్రీవాల్ సమావేశాలు, ప్రైవేటు వ్యక్తులకు కమీషన్లు, ఢిల్లీ మద్యం వ్యాపారంలోకి దక్షిణాదికి చెందిన రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రవేశించడం వంటి అంశాలను ప్రస్తావించారు.
జైళ్లో నాయకులు
మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ సహా 31 మంది వ్యక్తులు, సంస్థలపై ఎక్సైజ్ పాలసీ దర్యాప్తులో ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు ఆరు చార్జిషీట్లు దాఖలు చేసింది. ప్రస్తుతం సిసోడియా, సింగ్ తీహార్ జైలులో ఉన్నారు.