Delhi crime news : స్కూల్​లో గొడవ- 17ఏళ్ల సీనియర్​ని దారుణగా చంపిన మైనర్లు!-delhi crime news 17 year old stabbed to death in govindpuri by ex school mates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Crime News : స్కూల్​లో గొడవ- 17ఏళ్ల సీనియర్​ని దారుణగా చంపిన మైనర్లు!

Delhi crime news : స్కూల్​లో గొడవ- 17ఏళ్ల సీనియర్​ని దారుణగా చంపిన మైనర్లు!

Sharath Chitturi HT Telugu

Crime news : పుస్తకాలు పట్టుకోవాల్సిన పిల్లలు కత్తులు పట్టుకుంటున్నారు! చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీస్తున్నారు. దిల్లీలో తాజాగా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్​లో గొడవ కారణంగా సీనియర్​ని ముగ్గురు మైనర్లు కిరాతకంగా పొడిచి చంపేశారు.

చిన్న గొడవకే చంపేశారు!

దేశ రాజధాని దిల్లీలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ముగ్గురు మైనర్లు కలిసి నడిరోడ్డు మీద ఓ 17ఏళ్ల బాలుడిని చంపేశారు. వీరికి ముందే పరిచయం ఉందని, స్కూల్​లో జరిగిన గొడవపై కోపంతో మైనర్లు ఈ దారుణానికి ఒడిగట్టారని పోలీసులు వెల్లడించారు.

ఇదీ జరిగింది..

ఆగ్నేయ దిల్లీలోని గోవింద్​పురిలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ముగ్గురు మైనర్లు 17 ఏళ్ల బాలుడిని కత్తితో పొడిచి చంపారని, నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.

17 ఏళ్ల బాలుడు తమ సీనియర్ అని, తమను కొట్టాడని, అందుకే ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నామని నిందితుల్లో ఒకరు చెప్పాడు. శనివారం రాత్రి 8.30 గంటల సమయంలో 17 ఏళ్ల యువకుడు ఇంటికి తిరిగి వెళుతుండగా ఓఖ్లా ఎస్టేట్ రోడ్డు సమీపంలో అతడిని మైనర్లు అడ్డుకున్నారు. అతనిపై దాడి చేశారు. 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలురు ఆ బాలుడిని గొంతు నులిమి, మెడ, పొత్తికడుపుపై పలుమార్లు కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యారు.

స్థానికులు బాలుడిని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ వెంటనే అతడిని గోవింద్​పురి సమీపంలోని మజిడియా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఎయిమ్స్ ట్రామా సెంటర్​కి తీసుకెళ్లారు. తీవ్ర గాయాలపాలైన బాధితుడు అక్కడ మృతి చెందాడు. ఈ విషయంపై రాత్రి 9.45 గంటలకు పోలీసులకు సమాచారం అందింది.

మృతుడి తండ్రి కేరళవాసి. దిల్లీలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గోవింద్​పురిలోని జేజే కాలనీలో తల్లి, చెల్లెలితో కలిసి బాధితుడు నివసిస్తున్నాడు. ఇటీవల చదువు మానేసి సమీపంలోని దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

“అబ్బాయిలు మాకు తెలుసు. స్కూల్లో పాత కక్షలు ఉండేవి. గతంలో జరిగిన గొడవలో అతను కొన్ని చెడు మాటలు చెప్పి ఉంటాడని భావిస్తున్నాం. చిన్నచిన్న, పాత తగాదాలకు స్కూల్ పిల్లలు కత్తులు పట్టుకుని ఒకరినొకరు ఎలా చంపుకుంటారు? స్నాక్స్ తీసుకురావడానికి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. నేను ఇంటి నుంచి బయటకు వచ్చి చూసే సరికి రక్తపు మడుగులో పడి ఉన్నాడు,” అని మృతుడి మేనమామ తెలిపారు.

వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితులను పట్టుకునేందుకు బృందాలను పంపించామని డీసీపీ రవికుమార్ సింగ్ తెలిపారు. స్థానిక సాక్షులు, సీసీటీవీ ఫుటేజీల సాయంతో వారిని గుర్తించి అరెస్ట్​ చేసినట్టు వివరించారు.

నిందితుల్లో ఒకరు స్కూల్ డ్రాపౌట్ కాగా, మరో ఇద్దరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 11వ తరగతి చదువుతున్నారు.

ఈ వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. చిన్న విషయాలకు ఈ రోజుల్లో చంపుకుంటున్నారని ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

దిల్లీలో జువనైల్​ నేరాలు ఇటీవలి కాలంలో వివరీతంగా పెరుగుతున్నాయి. వేరువేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులను ఐదుగురు మైనర్లు దారుణంగా చంపిన ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో దిల్లీలో చోటుచేసుకుంది. మైనర్లు మద్యం మత్తులో ఉండి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.