iPhone gift: అమ్మ బంగారాన్ని దొంగిలించి.. గర్ల్ ఫ్రెండ్ కు ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిన 9 వ తరగతి విద్యార్థి
iPhone gift: బర్త్ డే రోజు గర్ల్ ఫ్రెండ్ కు ఆపిల్ ఐఫోన్ కొనివ్వడానికి, ఆమె బర్త్ డే పార్టీకి డబ్బులు అరెంజ్ చేయడానికి కన్నతల్లి బంగారాన్ని దొంగిలించిన ఓ బాలుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని నజఫ్ గఢ్ లో చోటుచేసుకుంది.
iPhone gift: ప్రియురాలికి ఆపిల్ ఐఫోన్ కొనివ్వడానికి, ఆమె బర్త్ డే పార్టీకి నిధులు సమకూర్చడానికి తన తల్లి బంగారాన్ని దొంగిలించిన ఓ బాలుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని నజఫ్ గఢ్ లో చోటుచేసుకుంది. ఇంట్లోని బంగారం కనిపించకపోవడంతో బాలుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారు చెవిపోగులు, బంగారు ఉంగరం, గొలుసు కనిపించకుండా పోయాయి. ఢిల్లీలోని ఇద్దరు స్వర్ణకారుల నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. స్వర్ణకారుల్లో ఒకరైన కమల్ వర్మను పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు ఏం చెప్పారు?
ఆగస్టు 3న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య గుర్తుతెలియని వ్యక్తి తన ఇంటి నుంచి రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు, ఒక బంగారు ఉంగరాన్ని దొంగిలించాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిందని ద్వారకా డిప్యూటీ పోలీస్ కమిషనర్ అంకిత్ సింగ్ తెలిపారు. ఇంట్లోకి ఎవరూ రాలేదని, బయటకు వెళ్లలేదని సీసీటీవీ ఫుటేజీలో తేలింది. ఆ తర్వాత ఈ నేరంలో ఇన్ సైడర్ పాత్రపై దర్యాప్తు బృందం దృష్టి సారించింది. నేరం జరిగినప్పటి నుంచి ఆ మహిళ మైనర్ కుమారుడు కనిపించడం లేదని వారు గుర్తించారు. ఆ బాలుడు స్థానికంగా ఉన్న పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు.
ఇంటి దొంగ పనే..
విచారణలో భాగంగా పోలీసులు ఆ బాలుడి పాఠశాల స్నేహితులను ప్రశ్నించింది. నిందితుడు రూ.50 వేల విలువైన కొత్త ఐఫోన్ కొన్నాడని పోలీసులకు అతడి స్కూల్ ఫ్రెండ్స్ చెప్పారు. ఆ బాలుడు ఉండే అవకాశమున్న ధరంపురా, కక్రోలా, నజఫ్ గఢ్ తదితర ప్రాంతాల్లో పోలీసులు వెతికారు. చివరకు మంగళవారం సాయంత్రం 6 గంటలకు బాలుడు తన ఇంటికి వస్తాడని సమాచారం అందిందని, దీంతో, అతడి ఇంటి సమీపంలో, ఆ బాలుడిని అదుపులోకి తీసుకున్నామని డీసీపీ సింగ్ తెలిపారు. అతని వద్ద నుంచి ఆపిల్ ఐఫోన్ (iPhone) ను ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గర్ల్ ఫ్రెండ్ కోసం..
తాను 9వ తరగతి చదువుతున్నానని, నజఫ్ గఢ్ లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నానని బాలుడు చెప్పాడు. తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో చదువుపై ఆసక్తి లేకపోవడంతో యావరేజ్ మార్కులు సాధించాడని డీసీపీ తెలిపారు. తన క్లాస్ మేట్ అయిన ఒక విద్యార్థినితో లవ్ లో ఉన్నానని, ఆమెకు ఐఫోన్ కొనివ్వడం కోసం ఇంట్లో నుంచి బంగారం దొంగిలించి, బంగారం షాపులో అమ్మేశానని విచారణలో వెల్లడించాడు.
తల్లి నిరాకరించడంతో..
‘‘9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తన గర్ల్ ఫ్రెండ్ బర్త్ డే రోజున ఆమెకు ఆపిల్ (apple) ఐ ఫోన్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అయితే, తన వద్ద డబ్బులు లేకపోవడంతో తన తల్లిని అడిగాడు. కానీ, ఇంటి ఆర్థిక పరిస్థితి వివరించిన ఆ తల్లి, డబ్బు ఇవ్వడానికి నిరాకరించింది. ముందు, చదువుపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చింది. గర్ల్ ఫ్రెండ్ బర్త్ డేకు గిఫ్ట్ ఇవ్వడానికి డబ్బు లేకపోవడంతో, ఆ బాలుడు తన ఇంట్లోని బంగారాన్ని దొంగిలించాలని నిర్ణయించుకున్నాడు'’’అని పోలీసులు తెలిపారు.