Delhi crime news: భార్య, అత్తామామల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య; సెల్ఫీ వీడియోలో వేధింపుల వివరాలు
Delhi crime news: ఓ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా (40) భార్యతో మనస్పర్థలు, వ్యాపార వివాదాల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో ఉరివేసుకుని చనిపోయారు.
Delhi crime news: భార్య వేధింపులతో బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్న కేసు వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకే దేశ రాజధాని ఢిల్లీలో మరో విషాద సంఘటన చోటు చేసుకుంది. దాదాపు అవే కారణాలతో ఢిల్లీలోని ఒక ప్రముఖ కేఫ్ సహ వ్యవస్థాపకుడు పునీత్ ఖురానా డిసెంబర్ 31న ఆత్మహత్య చేసుకున్నాడు.
భార్యతో విబేధాలు
మోడల్ టౌన్ లోని కల్యాణ్ విహార్ ప్రాంతంలోని తన నివాసంలోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్ కు పునీత్ ఖురానా ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. పునీత్ ఖురానా వైవాహిక జీవితంలో సమస్యలున్నాయని, భార్యతో విబేధాలున్నాయని, ఈ నేఫథ్యంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పునీత్ ఖురానా విడాకుల కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది.
బిజినెస్ పార్ట్ నర్
పునీత్ ఖురానా ఢిల్లీలోని ఒక ప్రముఖ కెఫేకు సహ వ్యవస్థాపకుడు. ఆయన భార్య మనికా జగదీష్ పహ్వా కూడా అందులో పార్ట్ నర్. వారికి 2016 లో వివాహమైంది. అయితే, వారి మధ్య వైవాహిక సమస్యలతో పాటు బిజినెస్ కు సంబంధించిన విబేధాలు కూడా ఉన్నాయి. కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఈ వివాదాల నేపథ్యంలో వారు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, అనూహ్యంగా పునీత్ ఖురానా డిసెంబర్ 31న అత్మహత్య చేసుకున్నారు. భార్య, అత్తామామల వేధింపుల వల్లనే పునీత్ ఖురానా చనిపోయాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భార్యతో మనస్పర్థలకు తోడు అత్తమామల వేధింపుల కారణంగానే పునీత్ ఖురానా ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపిస్తున్నారు.
పునీత్ ఖురానా కుటుంబ సభ్యుల ఆరోపణలు
పునీత్ ఖురానా మొబైల్ ఫోన్, ఇతర సంబంధిత వస్తువులను అతడి తండ్రి త్రిలోక్ నాథ్ పోలీసులకు అందించారు. పునీత్ ఖురానా, అతడి భార్యకు సంబంధించిన 16 నిమిషాల నిడివి గల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. వ్యాపార ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన ఆధారాలు అందులో లభించాయి. "మనం విడాకులు తీసుకుంటున్నాము. కానీ నేను ఇప్పటికీ మీ వ్యాపార భాగస్వామిని. మీరు నా బకాయిలు చెల్లించాలి' అని పునీత్ ఖురానా భార్య ఆ కాల్ లో పేర్కన్నట్లుగా ఉంది. ‘‘ఆమె (పునీత్ భార్య) అతడిని హింసిస్తూనే ఉండేది. నా కుమారుడికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పునీత్ తల్లి వ్యాఖ్యానించారు.
సెల్ఫీ వీడియో..
పునీత్ ఎదుర్కొన్న వేధింపులను అతడి సోదరి మీడియాకు వివరించారు. "మనికా పహ్వా, ఆమె సోదరి, తల్లిదండ్రులు అతన్ని మానసికంగా హింసించారు. వారి వేధింపుల గురించి సుమారు 59 నిమిషాల నిడివి గల వీడియోలో పునీత్ స్పష్టంగా రికార్డ్ చేశాడు. అందులో పునీత్ తాను ఎదుర్కొన్న వేధింపుల వివరాలన్నీ తెలిపాడు. అతడి భార్య పునీత్ సోషల్ మీడియా ఖాతాను కూడా హ్యాక్ చేసింది’’ అని ఆమె ఆరోపించింది.
పోస్ట్ మార్టం అనంతరం..
డిసెంబర్ 31వ తేదీ సాయంత్రం 4.18 గంటల సమయంలో పునీత్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బీజేఆర్ఎం ఆస్పత్రికి తరలించారు. ఈ కేసులో పునీత్ భార్యను పోలీసులు విచారణకు పిలిచారు. కొన్ని రోజుల క్రితం బెంగళూరులో అతుల్ సుభాష్ అనే 34 ఏళ్ల టెక్కీ 24 పేజీల సూసైడ్ నోట్ ను రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అందులో తన భార్య, ఆమె బంధువులు తనను వేధిస్తున్నారని, తనపై తప్పుడు కేసులు బనాయించి ఆత్మహత్యకు పురిగొల్పారని ఆయన ఆరోపించారు.