Delhi Assembly Elections : దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Delhi Assembly Elections 2025 : దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ జరుగుతోంది. త్రిముఖ పోరు జరుగుతున్న ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కడతారో చుడాలి.
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ఓటింగ్ నడుస్తోంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో దిల్లీలోని 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయిస్తారు. ఫలితాలు ఫిబ్రవరి 8న ప్రకటిస్తారు.

అధికారం ఎవరికో?
ఆమ్ ఆద్మీ పార్టీ మూడోసారి అధికారం చేపట్టేందుకు ప్రణాళికలు వేసింది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ కూడా దిల్లీ సింహాసనాన్ని కైవసం చేసుకోవడానికి కష్టపడుతున్నాయి. బీజేపీ 25 సంవత్సరాలకు పైగా అధికారానికి దూరంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి ముందు కాంగ్రెస్ 15 సంవత్సరాలు అధికారంలో ఉంది. కానీ గత రెండు ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.
భారీ భద్రతా
దేశ రాజధానిలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు 13,766 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రతా మధ్య పోలింగ్ జరుగుతోంది. ఓటింగ్ కోసం పారామిలిటరీ దళాలు, 35,626 దిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోమ్ గార్డులను మోహరించారు. దాదాపు 3,000 పోలింగ్ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించి, అక్కడ గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ సమయంలో పోలీసు బృందం డ్రోన్ల ద్వారా కూడా నిఘా ఉంచుతుంది.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఒక రోజు ముందు మంగళవారం ఓఖ్లా నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) అభ్యర్థి అమానతుల్లా ఖాన్ పై పోలీసులు మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఎప్ఐఆర్ నమోదు చేశారు. ఫిబ్రవరి 3, 2025న సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసినప్పటికీ, ఆప్ నాయకుడు తన అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేశాడని ఆరోపణలు ఉన్నాయి.
ఓటేసిన ప్రముఖులు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేశారు. కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఓటు వేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో జైశంకర్ NDMC స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ తుగ్లక్ క్రెసెంట్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తన భార్య లక్ష్మీ పూరితో కలిసి ఆనంద్ నికేతన్‌లోని మౌంట్ కార్మెల్ స్కూల్‌లో ఓటు వేశారు. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా తన భార్యతో కలిసి మోతీ బాగ్ పోలింగ్ కేంద్రంలో ఓటును వినియోగించుకున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మనీష్ సిసోడియా లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయన భార్య సీమా సిసోడియా కూడా ఈ పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు భారత ఆర్మీ ఛీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కూడా ఓటేశారు.