Delhi Stamped : ఒకటి కాదు- రెండు చోట్ల తొక్కిసలాట! నరకం చూసిన ప్రజలు- ప్లాట్​ఫామ్​పై భయానక దృశ్యాలు..-delayed trains blocked staircase what led to stampede at new delhi station ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Delhi Stamped : ఒకటి కాదు- రెండు చోట్ల తొక్కిసలాట! నరకం చూసిన ప్రజలు- ప్లాట్​ఫామ్​పై భయానక దృశ్యాలు..

Delhi Stamped : ఒకటి కాదు- రెండు చోట్ల తొక్కిసలాట! నరకం చూసిన ప్రజలు- ప్లాట్​ఫామ్​పై భయానక దృశ్యాలు..

Sharath Chitturi HT Telugu
Published Feb 16, 2025 09:51 AM IST

New Delhi station stampede: న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన భయానక దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ సమయంలో ప్రజలు నరకం చూసినట్టు స్పష్టమవుతోంది. మొత్తం రెండు చోట్ల తొక్కిసలాట జరిగినట్టు సమాచారం.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో రద్దీ..
న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో రద్దీ.. (PTI)

మహా కుంభమేళా నేపథ్యంలో న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వస్తున్న వార్తలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రయాగ్​రాజ్​కు వెళ్లే రైళ్లు ఆలస్యమవ్వడంతో మొదలైన గందరగోళం.. చివరికి తొక్కిసలాటకు దారితీయగా, ఈ ఘటనలో 18మంది మరణించారు. అయితే, ఒకటి కాదు.. రెండు చోట్ల తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట- కారణం ఏంటి?

మహా కుంభమేళా నేపథ్యంలో ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు ప్రయాణికులు శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్​కి చేరుకున్నారు. అయితే ప్రయాగ్​రాజ్​కు వెళ్లాల్సిన రైళ్లు ఆలస్యమయ్యాయి. అదే సమయంలో అప్పటికే స్టేషన్​లో ఉన్న స్వతంత్ర సేనానీ ఎక్స్​ప్రెస్​- భువనేశ్వర్​ రాజధాని (ఇవి కూడా ప్రయాగ్​రాజ్​కు వెళతాయి) రైలు బయలుదేరడం ఆలస్యమైంది. ఫలితంగా ప్రయాణికులతో సంబంధిత ప్లాట్​ఫామ్​లు కిక్కిరిసిపోయాయి.

"ప్రయాగ్​రాజ్​ ఎక్స్​ప్రెస్​ ప్లాట్​ఫామ్​ నెం. 14పైకి వచ్చినప్పుడు చాలా మంది ప్యాసింజర్లు ప్లాట్​ఫామ్​పై ఉన్నారు. స్వతంత్రత సేనాని ఎక్స్​ప్రెస్​, భువనేశ్వర్​ రాజధాని ఆలస్యమయ్యాయి. ఈ రైళ్లు ఎక్కాల్సిన ప్యాసింజర్లు ప్లాట్​ఫాం నెం. 12,13,14లో ఉండిపోయారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం 1500కిపైగా జనరల్​ టికెట్లు విక్రయించినట్టు, అందుకే రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయి, నియంత్రించలేని విధంగా మారినట్టు సమాచారం," అని రైల్వే డిప్యూటీ కమిషనర్​ ఆఫ్​ పోలీస్​ కేపీఎస్​ మల్హోత్రా తెలిపారు."

ప్లాట్​ఫామ్​ నెం14 దగ్గర, ప్లాట్​ఫామ్​ నెం.16కు సమీపంలోని ఎలివేటర్​ దగ్గర తొక్కిసలాట ఘటనలు జరిగాయని మల్హోత్రా వెల్లడించారు.

"రద్దీని నియంత్రించేందుకు అధికారులు ప్లాట్​ఫామ్​ నెం.14, 15 దగ్గర ఉన్న మెట్లను బ్లాక్​ చేశారు. కానీ రైళ్లు రావడం మరింత ఆలస్యమైంది. మెట్ల దగ్గర ప్యాసింజర్ల తాకిడి పెరిగింది. చివరికి మెట్లపైకి ప్రయాణికులు ఒకరిని, ఒకరు తోసుకుంటూ వెళ్లారు. ఈ సమయంలో గందరగోళం నెలకొంది. ఫలితంగా తొక్కిసలాట జరిగింది. చాలా మంది ఉక్కిరిబిక్కిరి అయ్యారు," అని ఓ అధికారి వెల్లడించారు.

అయితే 1500కిపైగా జనరల్​ టికెట్లు విక్రయించినట్టు, స్టేషన్​ లోపల రద్దీ పెరగడానికి ఇదీ ఒక కారణమని తెలుస్తోంది.

న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట జరిగిన 18మంది మరణించిన ఘటనపై రైల్వేశాఖ దర్యాప్తు చేపట్టింది.

'ప్రయత్నించాము.. కానీ!'

శనివారం రాత్రి న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట సమయంలో ఘటనాస్థలం వద్ద రద్దీని అదుపు చేసేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ సర్జెంట్​ తెలిపారు. కానీ ఎవరూ తమ మాట వినలేదని వివరించారు.

"రైల్వే స్టేషన్​లో ట్రై-సర్వీస్​ ఆఫీస్​ ఉంది. నా డ్యూటీ ముగించుకుని తిరిగి వెళుతుండగా రద్దీని చూశాను. మహా కుంభమేళా కోసం ప్రయాగ్​రాజ్​కు వెళ్లేందుకు ప్యాసింజర్లు వచ్చారు. ఒక చోట గుమిగూడవద్దని ప్రజలకు చెప్పాను. అనౌన్స్​మెంట్స్​ కూడా చేశాను. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించాను. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేదుకు మా టీమ్​ చర్యలు తీసుకునేందుకు ప్రయత్నించింది. గాయపడిన వారికి నేను సాయం చేశాను," అని ఆ ఆఫీసర్​ వెల్లడించారు.

మరోవైపు ఇలాంటి రద్దీని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్లాట్​ఫామ్​లు, రైళ్లు, బ్రిడ్జ్​లు, మెట్లు, ఎలివేటర్లు.. ఎక్కడ చూసినా జనాలే ఉన్నారని పేర్కొన్నారు.

భయానక దృశ్యాలు!

మరోవైపు న్యూదిల్లీ రైల్వే స్టేషన్​లో తొక్కిసలాట అనంతర దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. ప్లాట్​ఫామ్​లు, మెట్లు, ఎలివేటర్ల వద్ద చెప్పులు, సంచులు, బ్యాగులు చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి.

తొక్కిసలాట వల్ల చాలా మంది తప్పిపోయారు. 12మంది కుటుంబసభ్యులతో వెళ్లిన ఓ వ్యక్తి, ఈ తొక్కిసలాటలో తన సోదరిని కోల్పోయాడు. పరిస్థితి అదుపులోకి వచ్చిన ఆరగంట తర్వాత, ఆమె మృతదేహం అతనికి కనిపించింది.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.