Dehradun accident : రోడ్డు ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కారు- చెల్లాచెదురైన శరీర భగాలు..
Dehradun car accident : డెహ్రాడూన్‌లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. మృతుల శరీర భాగాలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను ఎక్స్ తొలగించాల్సి వచ్చింది!
ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌లో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ ట్రక్‌ని ఢీకొట్టడంతో ఓ ఇన్నోవా కారు నుజ్జునుజ్జు అయ్యింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. ప్రమాదం అనంతరం మృతుల శరీర భాగాలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. ఆ దృశ్యాలు ఎక్స్‌లో వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాలు చాలా భయానకంగా ఉండటంతో, ఎక్స్ సంస్థ, వాటిని తొలగించింది!
డెహ్రాడూన్ ఇన్నోవా ప్రమాదం: అసలేం జరిగింది?
డెహ్రాడూన్‌లో ప్రకంపనలు సృష్టించిన ఈ ఇన్నోవా కారు ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున జరిగింది! విద్యార్థుల బృందంతో వెళుతున్న ఇన్నోవా కారు ఓఎన్జీసీ చౌక్ వద్ద తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో కంటైనర్ ట్రక్కును ఢీకొట్టంది. వేగంగా వచ్చిన ఎస్యూవీ ట్రక్కు వెనుక ఎడమ భాగాన్ని బలంగా తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉన్న టయోటా ఇన్నోవా ఇప్పుడొక మెటల్ స్క్రాప్ గా మారిపోయింది.
డెహ్రాడూన్ ఘటనలో ట్రక్ డ్రైవర్ తప్పిదం లేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
ఈ ప్రమాదంలో ఇన్నోవా కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వీరంతా 19 నుంచి 25 ఏళ్ల వయస్సులోపు వారు కావడం గమనార్హం.
మృతుల పేర్లు గునీత్ సింగ్, కామాక్షి సింఘాల్, నవ్య గోయల్, రిషబ్ జైన్, అతుల్ అగర్వాల్, కునాల్ కుక్రేజా. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి సిద్ధేష్ అగర్వాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని తెలుసతోంది.
ఇన్నోవాలో వీరందరు గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలు, అటుగా వెళ్తున్న వారి వాంగ్మూలాలు సూచిస్తున్నాయి. నంబర్ ప్లేట్లు లేనందున ఎంయూవీ కొత్త వాహనం అయి ఉండొచ్చని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.
ఓ లగ్జరీ కారు అతివేగంతో ఇన్నోవాను ఓవర్ టేక్ చేసిందని, దాన్ని పట్టుకునే ప్రయత్నంలో డ్రైవర్ వేగాన్ని పెంచాడని అధికారులు తెలిపారు. ఇంతలో ఓ కంటైనర్ ట్రక్కు సాధారణ వేగంతో కూడలిని దాటందని, ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. సిద్ధేశ్ అగర్వాల్ ఏర్పాటు చేసిన పార్టీ నుంచి వీరందరు తిరిగి వస్తున్నారని తెలుస్తోంది.
ప్రమాదానికి సంబంధించిన భయానక దృశ్యాల్లో రోడ్డుకు అడ్డంగా శరీర భాగాలు చెల్లాచెదురుగా పడి ఉండటం కనిపించింది.
ఎక్స్ నుంచి వీడియో తొలగింపు..
వాస్తవానికి ఘటనాస్థలంలో దృశ్యాలు రక్తంతో నిండి, చాలా భయానకంగా కనిపించాయి. వీటిని బ్లర్ కూడా చేయకుండా ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన యూజర్‌ను దానిని తొలగించమని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ కోరింది. ఈ వీడియో తమ కంటెంట్ విధానాలను ఉల్లంఘించిందని పేర్కొంది.
సంబంధిత కథనం