Debate on price rise : ధరల పెరుగుదలపై నిర్మల వివరణ.. కాంగ్రెస్​ వాకౌట్​-debate on price rise in loksabha congress walks out amid nirmala s speech ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Debate On Price Rise In Loksabha, Congress Walks Out Amid Nirmala's Speech

Debate on price rise : ధరల పెరుగుదలపై నిర్మల వివరణ.. కాంగ్రెస్​ వాకౌట్​

Sharath Chitturi HT Telugu
Aug 01, 2022 08:28 PM IST

Debate on price rise : ధరల పెరుగుదలపై లోక్​సభలో ఎట్టకేలకు సోమవారం సాయంత్రం చర్చ జరిగింది. ఈ విషయంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రసంగించారు. ఆమె మాటలతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్​ ఎంపీలు.. వాకౌట్​ చేశారు.

నిర్మలా సీతారామన్​
నిర్మలా సీతారామన్​ (PTI)

Debate on price rise : భారత దేశ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకునే అవకాశమే లేదని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఉద్ఘాటించారు. ఈ మేరకు ధరల పెరుగుదలపై లోక్​సభలో ఆమె ప్రసంగించారు. నిర్మల ప్రసంగంపై అసహనం వ్యక్తం చేస్తూ.. కాంగ్రెస్​ ఎంపీలు సభ నుంచి వాకౌట్​ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

'అంతా బాగానే ఉంది..'

పార్లమెంట్​ వర్షాకాల సమావేశాలు మొదలైనప్పటి నుంచి ధరల పెరుగుదల సమస్యపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో లోక్​సభ అనేకమార్లు అట్టుడికింది. ఎన్నోసార్లు వాయిదా పడింది. చివరికి.. సోమవారం సాయంత్రం.. ధరల పెరుగుదలపై లోక్​సభలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే నిర్మలా సీతారామన్​ ప్రసంగించారు.

"ఇటీవలి కాలంలో ఎన్నో సమస్యలు వచ్చాయి. కొవిడ్​, ఒమిక్రాన్​, రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం.. ప్రపంచాన్ని కుదిపేశాయి. ఇన్ని గడ్డు పరిస్థితుల్లోనూ.. భారత దేశంలో ద్రవ్యోల్బణం 7శాతం మించకుండా చూసుకుంది ఈ ప్రభుత్వం. ఈ విషయాన్ని అందరు గుర్తించాలి. ప్రస్తుతం రిటైల్​ ద్రవ్యోల్బణం 7శాతంగా ఉంది. యూపీఏ పాలనలో.. అంటే 2004-2014 మధ్య.. ద్రవ్యోల్బణం రెండంకెలుగా కూడా ఉండేది. వరుసగా 22నెలల పాటు ద్రవ్యోల్బణం 9శాతం కన్నా ఎక్కువే ఉంది," అని నిర్మలా సీతారామన్​ వివరించారు.

Parliament monsoon session : "డేటా పరంగా చూస్తే.. దేశంలో అంతా బాగానే ఉంది. ఇతర దేశాల కన్నా భారత్​ ముందుంది. ఇప్పటికీ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం ఇండియానే. కానీ ఈ వ్యవహారంపై కొందరు రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. ఈ విషయంపై 30మంది ఎంపీలు మాట్లాడారు. వారందరు డేటాను కాకుండా.. రాజకీయ కోణంలోనే ప్రసంగించారు," అని విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు కేంద్రం ఆర్థికమంత్రి.

విపక్షాల నిరసన..

  • ధరల పెరుగుదలపై నిర్మలా సీతారామన్​ ఇచ్చిన సమాధానంతో అసంతృప్తి చెందిన కాంగ్రెస్​ ఎంపీలు.. సభ నుంచి బయటకు వాకౌట్​ చేశారు.
  • అంతకుముందు.. జీఎస్​టీతో పెన్సిల్​- స్టేషనరీ వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, ఓ విద్యార్థి.. రాసిన లేఖను ప్రస్తావించారు ఎన్​సీపీ ఎంపీ సుప్రియా సులే. దేశంలో పరిస్థితి ఇలా ఉందని వ్యాఖ్యానించారు.
  • తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ కకోలి ఘోష్​.. మరో అడుగు ముందుకేసి కేంద్రంపై వినూత్నంగా నిరసన తెలిపారు. సభలోకి వంకాయను తీసుకొచ్చి, తన ప్రసంగం మధ్యలో దానిని కొరికారు. "ఎల్​పీజీ సిలిండర్​ ధరలు భారీగా పెరిగాయి. ఇదే కొనసాగితే..ఇలా పచ్చి కూరగాయలే తినాల్సి వస్తుంది. ప్రభుత్వానికి ఇదే కావాలా?" అని ప్రశ్నించారు.

తిరిగొచ్చిన ఎంపీలు..

తీవ్ర నిరసనల మధ్య గత వారం.. నలుగురు ఎంపీలను లోక్​సభ నుంచి సస్పెండ్​ చేశారు స్పీకర్​ ఓం బిర్లా. కాగా.. వారిపై ఉన్న సస్పెన్షన్​ను సోమవారం ఎత్తివేశారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్