యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) అబుదాబిలో నాలుగు నెలల పసికందును హత్య చేసిన కేసులో మరణశిక్షను ఎదుర్కొంటున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన షహజాదీ ఖాన్ అనే మహిళను ఫిబ్రవరి 15న ఉరితీశారు. మహిళ భద్రత కోసం తండ్రి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం దిల్లీ హైకోర్టులో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సమాచారాన్ని ఇచ్చింది. ఈ పరిణామంపై జస్టిస్ సచిన్ దత్తా మాట్లాడుతూ ఇది చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. నాలుగు నెలల పసికందును చంపిన కేసులో యూపీలోని బందా జిల్లాకు చెందిన 33 ఏళ్ల మహిళకు అబుదాబిలో మరణశిక్ష విధించారన్నారు.
దీనిపై అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ వాదనలు వినిపిస్తూ.. ఫిబ్రవరి 15న ఉరి తీశారు. మార్చి 5న ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. తన కుమార్తె యోగక్షేమాలు తెలుసుకోవాలని షహజాదీ ఖాన్ తండ్రి దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ప్రభుత్వం ఈ సమాచారాన్ని ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 10న అబుదాబి పోలీసులకు అప్పగించిన షాజాదీ ఖాన్‌కు 2023 జూలై 31న మరణశిక్ష విధించారు. ఆమెను అల్ వాత్బా జైలులో ఉంచారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా నివాసి షబీర్ ఖాన్ తన కుమార్తె షెహజాది పరిస్థితిపై తీవ్ర అనిశ్చితి నెలకొందని, ఆమె స్థితిగతులను తెలుసుకోవడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖకు పలుమార్లు దరఖాస్తులు చేసినా అన్ని ప్రయత్నాలు ఫలించలేదని చెప్పారు. తన యజమాని నాలుగు నెలల పసికందును హత్య చేసిన కేసులో షెహజాదీకి స్థానిక కోర్టుల్లో తన వాదన వినిపించేందుకు పూర్తి అవకాశం ఇవ్వలేదని, నేరాన్ని అంగీకరించాలని ఆమెపై ఒత్తిడి తెచ్చారని, దీంతో ఆమెకు మరణశిక్ష విధించారని పిటిషన్‌లో ఆరోపించారు.
అంతకుముందు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ తమ కుమార్తె బతికి ఉందా లేక ఉరితీశారా అని తెలుసుకోవడమే తమ విజ్ఞప్తి అని చెప్పారు. ఫిబ్రవరి 14న షహజాదీ జైలు నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఒకట్రెండు రోజుల్లో ఉరితీస్తామని, ఇదే తన చివరి కాల్ అని చెప్పినట్టుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. అప్పటి నుంచి ఆ కుటుంబం ఆమె మాట వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంబసీ అధికారులు, పిటిషనర్ సంప్రదింపులు జరుపుతున్నారని, కుమార్తె అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 'మేం మా వంతు ప్రయత్నం చేశాం. కోర్టులో వాదించేందుకు అక్కడ ఓ న్యాయ సంస్థను నియమించాం. కానీ శిశుహత్యల విషయంలో అక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి.' అని చెప్పారు.
షెహజాదీ 2021 డిసెంబర్‌లో చెల్లుబాటు అయ్యే వీసాతో అబుదాబి వెళ్లారని పిటిషన్లో పేర్కొన్నారు. 'ఆగస్టు 2022లో ఆమె యజమానికి ఒక కొడుకు జన్మనిచ్చారు, అతని కోసం షెహజాదీ సంరక్షకురాలిగా ఉంది. డిసెంబర్ 7, 2022 న, శిశువుకు క్రమం తప్పకుండా టీకాలు ఇచ్చారు. ఓ రోజు సాయంత్రం దురదృష్టవశాత్తు బాబు మరణించాడు. పోస్టుమార్టంకు అనుమతి ఇవ్వడానికి శిశువు తల్లిదండ్రులు నిరాకరించారు.' అని పిటిషనర్ పేర్కొన్నారు.
సంబంధిత కథనం