Dead frog in chips packet: చిప్స్ ప్యాకెట్ లో కుళ్లిపోయిన కప్ప; కస్టమర్ల ప్రాణాలతో చెలగాటం
గుజరాత్ లోని జామ్ నగర్ లోని ఒక షాప్ లో ఒక వినియోగదారుడు కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్ లో చనిపోయిన కప్ప కనిపించింది. దాంతో, ఆ కస్టమర్ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. మరో ఘటనలో, ముంబైలో ఒక మహిళ జెప్టోలో ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ లో చచ్చిన ఎలుక కనిపించింది.
Dead frog in a chips packet: కొన్ని రోజుల క్రితం, ముంబై వాసి ఆన్ లైన్లో ఆర్డర్ చేసిన ఐస్ క్రీమ్ కోన్ లో మనిషి వేలి ముక్క కనిపించింది. ఇప్పుడు, అలాంటిదే మరో భయంకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గుజరాత్ లోని జామ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేసిన చిప్స్ ప్యాకెట్లో చనిపోయిన కప్ప కనిపించింది. దీనిపై నగరపాలక సంస్థ విచారణకు ఆదేశించింది. దర్యాప్తులో భాగంగా ప్యాకెట్ ఉత్పత్తి బ్యాచ్ నమూనాలను సేకరిస్తామని జామ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు.
చిప్స్ తో పాటు కుళ్లిపోయిన కప్ప
బాలాజీ వేఫర్స్ తయారు చేసిన క్రంచెక్స్ చిప్స్ ప్యాకెట్ లో జామ్ నగర్ కు చెందిన జాస్మిన్ పటేల్ అనే వ్యక్తికి చనిపోయిన కప్ప కనిపించింది. ఆ చిప్స్ ప్యాకెట్ ను జూన్ 18, మంగళవారం సాయంత్రం ఆయన స్థానికంగా ఉన్న ఒక షాప్ లో కొనుగోలు చేశారు. ఆ చిప్స్ ప్యాకెట్ లో ఇతర చిప్స్ తో పాటు కుళ్లిపోయిన స్థితిలో ఉన్న కప్ప ఉంది. ఈ విషయంపై జాస్మిన్ పటేల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో, వారు ఆ చిప్స్ ప్యాకెట్ ను కొనుగోలు చేసిన దుకాణాన్ని పరిశీలించారు. బ్యాచ్ నంబర్ తదితర వివరాలను సేకరించారు. మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ బ్యాచ్ వేఫర్ ప్యాకెట్ల నమూనాలను సేకరించి విచారణ జరుపుతున్నామని ఫుడ్ సేఫ్టీ అధికారి డీబీ పర్మార్ తెలిపారు.
ఫిర్యాదు చేసినా స్పందించలేదు
జామ్ నగర్ లోని పుష్కర్ ధామ్ సొసైటీకి చెందిన పటేల్ తన నాలుగేళ్ల మేనకోడలు కోసం జూన్ 18న సాయంత్రం సమీపంలోని దుకాణం నుంచి ఈ ప్యాకెట్ ను కొనుగోలు చేశారు. చనిపోయిన కప్పను గుర్తించకముందే తన మేనకోడలు, తొమ్మిది నెలల తన కుమార్తె ఆ చిప్స్ ను తిన్నారని ఆయన చెప్పారు. ‘‘నా మేనకోడలు ప్యాకెట్ విసిరేసింది. ఆమె చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ చనిపోయిన కప్పను చూసి నేను కూడా షాక్ అయ్యాను. బాలాజీ వేఫర్స్ డిస్ట్రిబ్యూటర్, కస్టమర్ కేర్ సర్వీస్ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో, నేను ఉదయం ఫుడ్ సేఫ్టీ అధికారికి సమాచారం ఇచ్చాను’’ అని పటేల్ చెప్పారు. మరో ఘటనలో, క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ జెప్టో ద్వారా ఆర్డర్ చేసిన హెర్షే చాక్లెట్ సిరప్ లో చనిపోయిన ఎలుక కనిపించింది. కలుషిత సిరప్ ను తన కుటుంబంలోని ముగ్గురు తాగారని, ఒకరు తాగిన తర్వాత వైద్య చికిత్స పొందాల్సి వచ్చిందని ప్రమీ శ్రీధర్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.