Madhya Pradesh crime news : మధ్యప్రదేశ్లో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత మహిళను నగ్నంగా చేసిన దుండగులు.. ఆమె కుమారుడిని చంపేశారు! మహిళ కూతురికి సంబంధించిన లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టారు.
సంబంధిత మహిళ తన కుటుంబంతో కలిసి.. మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటోంది. ఆమెకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. 2019లో ఆమె కుమార్తె లైంగిక వేధింపులకు గురైంది. ఆనాడు.. పోలీసులను సంప్రదించి, నలుగురిపై ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొన్ని రోజుల్లోనే మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. కాగా.. కేసును ఉపసంహరించుకోవాలని, 18ఏళ్ల యువతిపై కొందరు.. గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్నారు. ఆమె అందుకు నిరాకరించడంతో, చివరికి ఈ దారుణానికి ఒడిగట్టారు.
Dalit woman stripped naked in Madhya Pradesh : బాధిత కుటుంబం ఇంటిపై దాడి చేసిన దుండగులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారు! ఇంటిని పూర్తిగా ధ్వంసం చేశారు. దళిత మహిళ కుమారుడిని (18ఏళ్లు) దారుణంగా కొట్టారు. కుమారుడిని రక్షించుకునేందుకు వెళ్లిన మహిళను నగ్నంగా చేశారు. ఆమె షాక్కు గురైంది. ఇంతలో తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు ప్రాణాలు కోల్పోయారు.
అంతటితో ఆగని దుండగలు.. దళిత మహిళకు ఉన్న మరో ఇద్దరి కుమారుల కోసం గాలించారు. గ్రామంలోని ఇంటింటికీ తిరిగారు. మహిళ బంధువుల ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంబంధిత గ్రామానికి వెళ్లారు. నగ్నంగా ఉన్న మహిళను చూసి టవల్ ఇచ్చారు.
"నా బిడ్డను దారుణంగా కొట్టారు. అతను బతకలేదు. నన్ను కూడా వివస్త్రను చేశారు. పోలీసులు వచ్చి టవల్ ఇచ్చారు. ఆ తర్వాత చీర తీసుకొచ్చి ఇచ్చారు," అని దళిత మహిళ వెల్లడించింది.
Dalit teen killed in Madhya Pradesh : ఆ ప్రాంతంలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుండగా.. అధికారులు భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు.. 9మందిపై మర్డర్ కేసు వేసిన పోలీసులు.. ముగ్గురిపై కఠినమైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
తాజా ఘటనతో మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం రేగింది. విపక్ష పార్టీలు.. అధికార బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. బీజేపీ హయాంలో, రాష్ట్రంలో దళితులపై నేరాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. వీరి మాటలను బీజేపీ తిప్పికొట్టింది. నిందితులపై కఠిన చర్యలు చేపడతామని, కానీ ఇలాంటి విషయాలపై కాంగ్రెస్ రాజకీయాలు చేయడం సరికాదని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ.. తన హయాంలో అసలు దళితులు, వారి సమస్యలనే పట్టించుకోలేదని ఆరోపించింది.
సంబంధిత కథనం