Cyclone Dana : ఒడిశావైపు దూసుకెళుతున్న 'దానా'.. తుపానుకు ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
Cyclone Dana name given by : ఒడిశావైపు దానా తుపాను దూసుకెళుతోంది. ఇంకొన్ని రోజుల్లో ఇది తీరం దాటనుంది. అయితే ఈ తుపానుకు దానా అని ఎవరు పేరు పెట్టారు? అసలు దానా అంటే ఏంటి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
హిందూ మహాసముద్రంలో ఏర్పడిన 'దానా' తుపాను రాబోయే రోజుల్లో ఒడిశాను తాకనుంది. ఫలితంగా ఈ దానా తుపాను రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలకు కారణమవుతుందని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) అంచనా వేసింది. అయితే తుపానులకు వాటి పేర్లు ఎలా వచ్చాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ తుపానుకు దానా అని ఎవరు పేరు పెట్టారో మీకు తెలుసా?
తుపానులకు పేర్లు ఇలా పెడతారు..
ప్రపంచవ్యాప్తంగా ట్రాపికల్ సైక్లోన్స్ పేర్ల జాబితాను నిర్వహించడానికి ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) బాధ్యత వహిస్తుంది. ఏదైనా కొత్త తుపాను ఏర్పడినప్పుడు ముందుగానే నిర్ణయించిన పేర్ల జాబితాను ఉపయోగిస్తుంది. వీటిని అక్షర క్రమంలో కేటాయించడం జరుగుతుంది. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి ఇవి రిపీట్ అవుతుంటాయి.
"దానా" వెనుక అసలు కథ..
ఉత్తర హిందూ మహాసముద్రం కోసం ఉష్ణమండల తుపాను నామకరణ వ్యవస్థలో పాల్గొన్న 14 దేశాల్లో ఒకటైన సౌదీ అరేబియా ఈ "దానా" అనే పేరును అందించింది. "దానా" అనే పేరు అరబిక్ నుంచి ఉద్భవించింది. దీని అర్థం "ఉదారత" లేదా “బహుమానం” అని వస్తుంది.
ఇదీ చూడండి:- AP Cyclone Alert: బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం..రెండ్రోజుల్లో తుఫానుగా రూపాంతరం.. ఉత్తరాంధ్రకు పొంచి ఉన్న ముప్పు..
ప్రాంతీయ ప్రాముఖ్యత..
తుపానులకు ప్రాంతీయ పదాలు లేదా అవగాహన పెంచే విధంగా లేదా ఈ తుఫానుల ప్రభావిత దేశాల మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించే విధంగా ఉపయోగపడుతుందని పేర్లు పెడుతుంటారు. ఇది కమ్యూనికేషన్, హెచ్చరిక వ్యవస్థలను మరింత ప్రభావవంతం చేస్తుంది.
ఈ ప్రాంతంలో ఇటీవలి తుపానులకు వివిధ దేశాల నుంచి వచ్చిన పేర్లను ఇక్కడ చూడండి..
- తౌక్టే తుపాను (మయన్మార్ పేరు, "గెక్కో" అని అర్థం)
- నివర్ తుపాను (ఇరాన్ పేరు, "కాంతి" లేదా "గాలి" అని అర్థం)
- అంఫన్ తుపాను (థాయ్లాండ్ పేరు, "ఆకాశం" అని అర్థం)
దానా తుపాను ప్రభావం ఎంత..?
మధ్య అండమాన్ సముద్రంపై అక్టోబర్ 23 (బుధవారం) నాటికి వాయుగుండం దానా తుపానుగా బలపడి వాయువ్య బంగాళాఖాతం చేరుకుంటుందని ఐఎండీ చెబుతోంది. అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరంలో అక్టోబర్ 23 నుంచి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అక్టోబర్ 24 రాత్రి నుంచి అక్టోబర్ 25 ఉదయం వరకు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా మత్స్యకారులు ఈ నెల 23న సముద్రానికి దూరంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
అక్టోబర్ 21 వరకు అండమాన్ సముద్రంలో, అక్టోబర్ 22, 24 తేదీల్లో మధ్య బంగాళాఖాతం, అక్టోబర్ 24 నుంచి 25 వరకు ఉత్తర బంగాళాఖాతంలోకి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు సూచించారు.
సంబంధిత కథనం