భయానక దానా తుపాను తీరం దాటింది! భితర్కనికా నేషనల్ పార్క్, ధమ్రా మధ్య గురువారం అర్ధరాత్రి తుపాను తీరం దాటడంతో ఒడిశా తీరాన్ని భారీ గాలులు, వర్షాలు ముంచెత్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
కేంద్రపారా జిల్లాలోని భితర్కనికా, భద్రక్ జిల్లాలోని ధమ్రా మధ్య అర్ధరాత్రి 12:10 గంటలకు దాన తుపాను తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఆ తర్వాత బలహీనపడుతుందని ఐఎండీ వివరించింది. ఆ తర్వాత ధెంకనల్, అంగుల్ జిల్లా వైపు పయనిస్తుందని ఐఎండీ భువనేశ్వర్ రీజనల్ డైరెక్టర్ మనోరమ మొహంతి తెలిపారు. ఒడిశా తీరప్రాంతంలో రోజంతా భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేశారు.
దానా తుపాను తీరం దాటడంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో భద్రక్, కేంద్రపారా జిల్లాల్లోని తీరం వద్ద సాధారణం కంటే 1-1.5 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడుతున్నాయని వివరించారు.
జగత్సింగ్పూర్, కేంద్రపడా, కటక్, భద్రక్, జాజ్‌పూర్, బాలాసోర్, మయూర్భంజ్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (>20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జాజ్‌పూర్, భద్రక్, పూరీ, ధెంకనాల్, ఖోర్ధా, కటక్, జగత్సింగ్పూర్, కేంద్రపడా, అంగుల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (>20 సెంటీమీటర్లు) కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారి ఒకరు తెలిపారు.
ఒడిశా ప్రభుత్వం మొదట పది లక్షల మందిని తరలించాలని ప్రతిపాదించింది. అయితే గతంలో గుర్తించిన దానికంటే దానా చాలా బలహీనమైన వ్యవస్థ అని స్పష్టమవడంతో ఈ ప్రణాళికను విరమించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
దానా తుపాను సముద్రంలో తక్కువ ప్రయాణ సమయాన్ని కలిగి ఉండటం వల్ల తీవ్ర స్థాయికి చేరుకోలేదని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తీరానికి అతి సమీపంలో తుపాను ఏర్పడిందని, అందువల్ల దాని జీవితకాలం తక్కువగా ఉందన్నారు. అయినప్పటికీ, ఇది తీవ్రమైన తుపానే అని. దీనికి ప్రధాన కారణం వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత (ఎస్ఎస్టీ) అని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు గురువారం తెలిపారు.
దానా తూర్పు తీరంలో ప్రవేశించడానికి కొన్ని గంటల ముందు, దాదాపు 600,000 మందిని 6000 పైగా తుపాను షెల్టర్లు, భవనాలకు తరలించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కు చెందిన 19 బృందాలు, ఒడిశా డిజాస్టర్ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్‌కి చెందిన 51 బృందాలతో పాటు అగ్నిమాపక శాఖకు చెందిన 220 బృందాలు సహాయక చర్యలకు సహాయపడటానికి, రహదారులను క్లియర్ చేయడానికి ప్రభావిత జిల్లాల్లో మోహరించాయి. అన్ని జిల్లాల్లో అదనంగా 158 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు.
ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రపారా, భద్రక్, బాలాసోర్ జిల్లాలను హై-రిస్క్ జోన్లుగా వర్గీకరించింది. కేటగిరీ-2 కింద మయూర్ భంజ్లో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. జగత్సింగ్పూర్, కటక్, జాజ్పూర్లో గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.
ఒడిశా మీదుగా ప్రయాణించే 200కు పైగా రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయగా, భువనేశ్వర్‌లో 40 విమానాలను రద్దు చేసినట్లు విమానాశ్రయ డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ గురువారం తెలిపారు.
భువనేశ్వర్‌లో 35-40 నాట్స్ లేదా అంతకంటే ఎక్కువ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, ఇది విమాన కార్యకలాపాలకు సురక్షితం కాదని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం డైరెక్టర్ పీకే ప్రధాన్ తెలిపారు. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకు విమానాశ్రయంలో విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించినట్లు ప్రధాన్ తెలిపారు. తుపాను నేపథ్యంలో బాలాసోర్ నుంచి భువనేశ్వర్‌కు ప్రైవేటు బస్సు సర్వీసులను సైతం నిలిపివేశారు.
సంబంధిత కథనం