పెను తుపాను బిపోర్జాయ్ (Biparjoy) గుజరాత్ లో విధ్వంసం సృష్టిస్తోంది. భారీ వర్షాలు, తీవ్రమైన గాలులతో జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఈ తుపాను కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో ఇద్దరు చనిపోయారు. 22 మంది గాయపడ్డారు.
గుజరాత్ లోని కచ్ , సౌరాష్ట్ర ప్రాంతాలను బిపోర్జాయ్ తుపాను అతలాకుతలం చేసింది. తుపాను కారణంగా ముంద్రాలోని గ్రేవిటా ప్లాంట్ పాక్షికంగా ధ్వంసమైంది. దాంతో, ప్లాంట్ లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. బిపోర్జాయ్ తుపాను వల్ల తీవ్రమైన గాలులకు తోడు, భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఈ తుపాను కారణంగా కచ్ , సౌరాష్ట్ర ప్రాంతాల్లో 1092 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 5120 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. 186 సబ్ స్టేషన్స్, 2502 ఫీడర్స్ ధ్వంసమయ్యాయి. వర్షాలు, పెను గాలులకు తోడు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాను సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
బిపోర్జాయ్ తుపాను కారణంగా సౌరాష్ట్ర ప్రాంతంలో ఇద్దరు మరణించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, ఈ మరణాలు తుపాను తీరం దాటకముందు సంభవించాయని, తుపాను తీరం దాటిన తరువాత ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్ వెల్లడించారు. తుపాను వల్ల మరో 22 మంది గాయపడ్డారని, పెద్ద సంఖ్యలో పశువులు మరణించాయని తెలిపారు. తీవ్రమైన వేగంతో వీస్తున్న గాలులు, భారీ వర్షాల కారణంగా 500 ఇళ్లు ధ్వంసమయ్యాయి. కచ్ ప్రాంతంలో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై సమాచారం లేదని అధికారులు తెలిపారు. తుపాను తీవ్రత తగ్గిన తరువాత, జరిగిన నష్టంపై అంచనాకు వస్తామని వెల్లడించారు. ప్రస్తుతం బిపోర్జాయ్ తుపాను భుజ్ కు 25 కిమీల దూరంలో కేంద్రీకృతమైంది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం గంటకు 50 నుంచి 70 కిమీల వేగంతో గాలులు వీస్తున్నాయి.