Cryptocurrency prices today : మళ్లీ పతనమైన 'క్రిప్టో'.. బిట్‌కాయిన్ 6శాతం డౌన్
Cryptocurrency prices today : క్రిప్టోకరెన్సీలు మళ్లీ పతనమయ్యాయి. బిట్‌కాయిన్ 6శాతం మేర నష్టపోయింది.
Cryptocurrency prices today : క్రిప్టోకరెన్సీ ధరలు శనివారం భారీగా పతనమయ్యాయి. బిట్‌కాయిన్.. 21,000 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. ప్రపంచంలో ప్రముఖ క్రిప్టోకరెన్సీల్లో ఒకటైన బిట్‌కాయిన్ ధర.. 6శాతం పతనమై, 20,298 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

కాయిన్‌గెకో వెబ్సైట్ ప్రకారం.. ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్ క్యాపిటల్.. 24 గంటల్లో 1.02 ట్రిలియన్ డాలర్లు పతనమైంది. అయినప్పటికీ.. మార్కెట్ క్యాపిటల్ 1 ట్రిలియన్ డాలర్ మార్క్ ఎగువనే ఉంది.
మరోవైపు రెండో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ ఎథర్.. 10శాతం నష్టపోయి 1,509 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. క్రిప్టో మార్కెట్లో గత కొంత కాలంగా ఎథర్ మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ.. అనూహ్యంగా పడటంతో మదుపర్లు ఆందోళన చెందుతున్నారు.
అయితే.. 'మెర్జ్' సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండటా.. ఎథర్లో పెట్టుబడి పెట్టిన వారికి ఊరటనిచ్చే విషయం. సెప్టెంబర్ 20 నాటికి ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలుస్తోంది.
Bitcoin price today : ఇక మరో క్రిప్టోకరెన్సీ డోగీకాయిన్.. 7శాతం మేర పతనమై.. 0.06 డాలర్ల వద్ద కొనసాగుతోంది. షిబా ఇను క్రిప్టో కరెన్సీ.. 10శాతం పడిపోయి 0.000013 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వార్త స్టాక్ మార్కెట్‌తో పాటు క్రిప్టో కరెన్సీపైనా ప్రభావం చుపించింది. ద్రవ్యోల్బణం కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటామని, వడ్డీ రేట్లను భారీగా పెంచుతామని ఫెడ్ ఛైర్మన్ పావెల్ ఇచ్చిన సంకేతాలు మార్కెట్లకు ప్రతికూలంగా మరాయి.
"రానున్న రోజుల్లో వడ్డీ రేట్లను మరింత పెంచుతాము. ఈ చర్యలతో ప్రజలు, వ్యాపారులకు బాధ కలగవచ్చు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చు. ప్రజలు తమ ఉద్యోగాలు కోల్పోవచ్చు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలంటే ఈ బాధను భరించక తప్పదు. కానీ ధరల్లో స్థిరత్వాన్ని తిరిగి తీసుకురాకపోతే కలిగే బాధ ఇంకా దారుణంగా ఉంటుంది. అందుకే వడ్డీ రేట్ల పెంపు తప్పదు," అని ఫెడ్ ఛైర్మన్ పావెల్ అభిప్రాయపడ్డారు.
ఈ పరిణామాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీగా, ఒక్కసారిగా పతనమయ్యాయి. మదుపర్లలో మళ్లీ భయాలు మొదలయ్యాయి. ఫలితంగా డౌ జోన్స్ సూచీ.. ఏకంగా 1000పాయింట్లు పతనమైంది.
బిట్‌కాయిన్.. గత శుక్రవారం నుంచి 22000-20000 డాలర్ల మధ్యే కదలాడుతోంది. అయితే.. జూన్ కనిష్ఠాల నుంచి బిట్‌కాయిన్ కోలుకోవడం మదుపర్లకు ఉపశమనం కలిగించిన వార్త.
ఏదిఏమైనా క్రిప్టోలో పెట్టుబడి కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన రిస్క్‌ని తీసుకోగలిగేవారే పెట్టుబడులు పెట్టాలని సూచిస్తున్నారు.
సంబంధిత కథనం