Delhi Excise Policy case: ఆ ఇద్దరికి 21 వరకు రిమాండ్ పొడిగింపు
Delhi Excise Policy case: శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు కోర్టు ఈనెల 21 వరకు రిమాండ్ పొడిగించింది.
న్యూఢిల్లీ, నవంబర్ 17: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22కి సంబంధించి మనీలాండరింగ్ విచారణలో భాగంగా ఈడీ అరెస్టు చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన ఇద్దరు వ్యాపారులకు రిమాండ్‌ను రోస్ అవెన్యూ కోర్టు నవంబర్ 21 వరకు పొడిగించింది. అంతకుముందు వారిని కోర్టు ఏడు రోజుల రిమాండ్‌కు పంపింది.
వ్యాపారవేత్తలు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో సుదీర్ఘంగా విచారించిన అనంతరం మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద గత వారం ఈడీ అరెస్టు చేసింది.
శరత్ చంద్రా రెడ్డి హైదరాబాద్‌కు చెందిన అరబిందో ఫార్మా కంపెనీకి అధిపతి. మద్యం వ్యాపారంలో ఉన్నారు. ఇక పెర్నార్డ్ రికార్డ్ అనే కంపెనీకి బినోయ్ బాబు అధినేతగా ఉన్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ మనీలాండరింగ్ కేసులో ఈడీ కొనసాగిస్తున్న దర్యాప్తులో ప్రాథమిక ఆధారాల ప్రాతిపదికన ఈ ఇద్దరు వ్యాపారవేత్తలను అదుపులోకి తీసుకున్నారు.
తదుపరి విచారణ నిమిత్తం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వారిని తదుపరి కస్టడీకి కోరింది. సాక్షులు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లను ప్రభావితం చేస్తారని నివేదించింది. అయితే శరత్ రెడ్డి తరఫు సీనియర్ న్యాయవాదులు సుధీర్ నందర్‌జోగ్, సిద్ధార్థ్ లూథ్రా తదుపరి రిమాండ్‌ను వ్యతిరేకించారు.
2021-22 ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ప్రయోజనం పొందడానికి వివిధ వ్యాపార యజమానులు, రాజకీయ నాయకులతో కుట్ర చేశాడని శరత్‌చంద్రారెడ్డిపై ఈడీ ఆరోపణలు చేసింది.
‘ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ లక్ష్యాలకు విరుద్ధంగా కార్టలైజేషన్ ద్వారా మార్కెట్ వాటాను భారీగా నియంత్రించేందుకు శరత్ రెడ్డి కుట్రపన్నారు..’ అని ఈడీ ఆరోపణలు చేసింది.
ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వ్యక్తిగత సహాయకుడు దేవేంద్ర శర్మను ప్రశ్నించిన మీదట ఐదు ప్రదేశాలలో దాడులు నిర్వహించి ఈ వ్యాపారవేత్తలను ఈడీ అరెస్టు చేసింది.
ఈడీ వారి కస్టోడియల్ రిమాండ్‌ను కోరింది. పీఎంఎల్ఏ- 2002లోని సెక్షన్ 17కు లోబడి ఈ రోజు వరకు జరిపిన సోదాల్లో భారీ డిజిటల్, భౌతిక రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. ఈ కుట్రలో పాలుపంచుకున్న ఇతర అసోసియేట్‌లు, సంస్థలకు సంబంధించి వారిద్దరినీ విచారించాలని నివేదించింది.
ఈ కేసులో ఢిల్లీలోని జోర్ బాగ్‌కు చెందిన మద్యం పంపిణీదారు ఇండోస్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహేంద్రుని అక్టోబరులో అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీ, పంజాబ్‌లోని దాదాపు మూడు డజన్ల ప్రదేశాలలో ఈడీ దాడులు చేసింది.
ఈ కేసులో నిందితుల్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపీ కృష్ణ, డిప్యూటీ కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషనర్ పంకజ్ భట్నాగర్ ఉన్నారు.
ఇతర నిందితుల జాబితాలో పెర్నోడ్ రికార్డ్ మాజీ ఉద్యోగి మనోజ్ రాయ్, బ్రిండ్‌కో సేల్స్ డైరెక్టర్ అమన్‌దీప్ ధాల్, బడ్డీ రిటైల్ డైరెక్టర్ అమిత్ అరోరా, దినేష్ అరోరా, సన్నీ మార్వా, అరుణ్ రామచంద్ర పిళ్లై, అర్జున్ పాండే తదితరులు ఉన్నారు.
ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హోల్డర్‌లకు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని, లైసెన్సు ఫీజు మినహాయింపు లేదా తగ్గింపు, ఎల్-1 లైసెన్స్‌ను అనుమతి లేకుండా పొడిగించడం వంటి అవకతవకలు జరిగాయని ఈడీ, సీబీఐ ఆరోపించాయి.
టెండర్ దక్కిన వారికి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ నిర్ణీత నిబంధనలకు విరుద్ధంగా దాదాపు రూ. 30 కోట్ల ఎర్నెస్ట్ మనీ డిపాజిట్‌ను రీఫండ్ చేయాలని నిర్ణయించింది. లైసెన్స్ ఫీజులపై మినహాయింపు కూడా నిబంధనలకు విరుద్ధంగా అనుమతించింది.
దీని వల్ల ఖజానాకు రూ. 144.36 కోట్ల నష్టం వాటిల్లిందని, ఢిల్లీ లెఫ్టినెంట్-గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సిఫార్సు మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచన మేరకు ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసినట్లు సీబీఐ పేర్కొంది. సీబీఐ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీలాండరింగ్ వ్యవహారాలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.