5 states election 2023 : 5 రాష్ట్రాల ఎన్నికలు.. కాంగ్రెస్​కు ‘అగ్ని పరీక్ష’!-cong set for assembly poll semi final ahead of 2024 with guarantees caste census demand ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5 States Election 2023 : 5 రాష్ట్రాల ఎన్నికలు.. కాంగ్రెస్​కు ‘అగ్ని పరీక్ష’!

5 states election 2023 : 5 రాష్ట్రాల ఎన్నికలు.. కాంగ్రెస్​కు ‘అగ్ని పరీక్ష’!

Sharath Chitturi HT Telugu
Oct 10, 2023 11:26 AM IST

5 states election 2023 : త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్​కు అత్యంత కీలకం! లోక్​సభ సమరంలో కాంగ్రెస్​ ఏమేరకు ప్రభావం చూపిస్తుందనేది తేలిపోతుంది. అందుకే ఈ ఎన్నికలను పార్టీ చాలా సీరియస్​గా తీసుకుంది. మరి గెలుస్తుందా?

5 రాష్ట్రాల ఎన్నికలు.. కాంగ్రెస్​కు ‘అగ్నిపరీక్ష’!
5 రాష్ట్రాల ఎన్నికలు.. కాంగ్రెస్​కు ‘అగ్నిపరీక్ష’! (Hindustan Times)

5 states election 2023 : 5 రాష్ట్రాల ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. ఫలితంగా దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి తారస్థాయికి చేరింది. 2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్​గా నిలువనున్న ఈ అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్​గా తీసుకున్నాయి. ముఖ్యంగా.. కేంద్రంలో 9ఏళ్లుగా విపక్షంలో కూర్చుండిపోయి, ఉనికిని పూర్తిగా కోల్పోయే స్థితి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాంగ్రెస్​కు.. ఇది నిజంగా అగ్ని పరీక్షే! ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్​ వ్యూహాలు, గెలుపోటములపై వాటి ప్రభావాలను ఇక్కడ తెలుసుకుందాము..

కాంగ్రెస్​ వ్యూహాలు ఏంటి?

తెలంగాణ, ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, మిజోరంలో నవంబర్​ 7 నుంచి 30 వరకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో ఛత్తీస్​గఢ్​, రాజస్థాన్​లో కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉంది. 2018 మధ్యప్రదేశ్​ ఎన్నికల్లో మెజారిటీ ఉండి, ప్రభుత్వాన్ని స్థాపించినప్పటికీ.. తిరుగుబాటు జ్వాలలతో దానిని కాపాడుకోలేక, అధికారాన్ని బీజేపీకి అప్పగించింది.

Rajasthan Assembly election schedule : రాజస్థాన్​:- ఈ రాష్ట్రం​లో బీజేపీతో పోరు హోరాహోరీగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు ప్రధాన కారణం.. కాంగ్రెస్​లోని అంతర్గత యుద్ధం. 2018 రాజస్థాన్​ ఎన్నికల్లో గెలవడమే ఆలస్యం.. సీఎం అసోక్​ గహ్లోత్​, డిప్యూటీ సీఎం సచిన్​ పైలట్​ల మధ్య తీవ్రమైన విభేదాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు కూడా.. ఈ వ్యవహారం తరచూ వార్తలకెక్కేది. ఒకానొక దశలో.. మధ్యప్రదేశ్​లో జ్యోతిరాదిత్య సింథియా చేసినట్టు (కాంగ్రెస్​ను వీడి బీజేపీలో చేరడం), సచిన్​ పైలట్​ కూడా తిరుగుబాటు ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. ప్రభుత్వం దాదాపుగా కూలిపోయే పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ వెంటనే స్పందించిన హైకమాండ్​.. సచిన్​ పైలట్​ను బుజ్జగించింది. అయినప్పటికీ.. పార్టీపై ఆయన ఒకింత అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది.

అయితే.. ఇక్కడ బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు కనిపిస్తుండటం.. కాంగ్రెస్​కు కలిసి వచ్చే విషయం! కమలదళంలో సీనియర్​ లెవల్​ నేతలకు పాడటం లేదని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికలు వచ్చేసరికి.. ఏమీ జరగనట్టు, పార్టీలో నేతలందరు బయటకు నవ్వుతూ కనిపిస్తున్నారు.

మరోవైపు.. గత కొన్ని నెలలుగా రాజస్థాన్​లో నేరాలు అత్యంత ఆందోళనకర స్థాయికి చేరాయి. అత్యాచారాలు, హత్యలు, కిడ్నాప్​లు.. నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. చాలాసార్లు.. ఇవి గహ్లోత్​ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. వీటి ప్రభావం ఎన్నికలపై ఎంత ఉంటుందనేది చూడాలి.

Madhya Pradesh Congress : ఛత్తీస్​గఢ్​:- ఇక్కడ.. కాంగ్రెస్​కు పైచేయి ఉన్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్​ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి. సీఎం భూఫేస్​ భగేల్​ తీసుకొచ్చిన ప్రభుత్వ పథకాలు క్లిక్​ అయినట్టు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మధ్యప్రదేశ్​:- ఇక్కడ బీజేపీపై కాస్త అసంతృప్తి ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం శివరాజ్​ సింగ్​ చౌహాన్​ పనితీరుపై అధిష్ఠానం సంతృప్తిగా లేదని, ఈసారి గెలిస్తే.. ఆయన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇది కాంగ్రెస్​కు ఒకింత కలిసి వచ్చే విషయం. కాంగ్రెస్​ కూడా గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది.

Telangana election date : తెలంగాణ:- 2018 తెలంగాణ ఎన్నికలతో పోల్చుకుంటే.. రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్​ పుంజుకుందనే చెప్పాలి! రేవంత్​ రెడ్డీ నేతృత్వంలో బీఆర్​ఎస్​పై ఆ పార్టీ గట్టిగానే పోరాటం చేస్తోంది. వాస్తవానికి ఇక్కడ బీజేపీ బలంగా మారుుతుందని అందరు భావించినా.. కమలదళం ఇక్కడ కాస్త వెనకడుగు వేసింది. ఫలితంగా బీఆర్ఎస్​తో కాంగ్రెస్​ పోరాటం మరింత తీవ్రతరం చేసింది.

మిజోరంలోనూ పాగా వేయాలని కాంగ్రెస్​ భావిస్తోంది. అక్కడి ప్రజలను ఆకట్టుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తోంది.

అయితే.. ఇటీవలే బయటకు వచ్చిన పలు సర్వేల ప్రకారం.. మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​, తెలంగాణలో కాంగ్రెస్​కు సానుకూలత అధికంగా ఉంది. రాజస్థాన్​లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది. మిజోరంలో హంగ్​ ఏర్పడొచ్చు!

కుల గణన అస్త్రం ఫలిస్తుందా?

Congress on Caste census : 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్​ పార్టీ ప్రజలను ఆకట్టుకునే విధంగా హామీలు ఇస్తోంది. నిరుడు కర్ణాటకలో సాధించిన భారీ విజయంతో నూతన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్​.. అదే తరహాలో ఇతర రాష్ట్రాలపైనా ప్రభావం చూపించాలని ప్రణాళికలు రచిస్తోంది.

ఇక్కడ కుల గణన గురించి ముఖ్యంగా ప్రస్తావించాలి. బిహార్​లో నితీశ్​ కుమార్​ ప్రభుత్వం చేపట్టిన కుల గణన.. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలన్ని డిమాండ్​లు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. దీనికి కేంద్రంలోని బీజేపీ సానుకూలంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిని క్యాష్​ చేసుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్​.. కుల గణన అంశాన్ని తీవ్రస్థాయిలో లేవనెత్తుతోంది. అన్ని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లో కుల గణన చేపడతామని పార్టీ నేతలు హామీలిస్తున్నారు. కుల గణన అనేది పేదలకు ఓ శక్తివంతమైన ఆయుధం అని రాహుల్​ గాంధీ కూడా అభిప్రాయపడ్డారు.

ఈ 5 రాష్ట్రాల ఎన్నికలనే కాదు.. లోక్​సభ ఎన్నికల్లో కూడా ఈ కుల గణన అంశం తమకు సానుకూలంగా మారుతుందని కాంగ్రెస్​ పార్టీ భావిస్తోంది.

ఇండియాకూ కీలకమే..!

Telangana Congress latest news : 2024 సార్వత్రిక సమరంలో బీజేపీని ఓడించాలని దేశంలోని దాదాపు అన్ని విపక్ష పార్టీలూ ఏకమైన విషయం తెలిసిందే. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికలు.. ఇండియా బృందానికి చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్​ ప్రదర్శన బలంగా ఉంటే.. ఇండియా బ్లాక్​లో శక్తివంతమైన భాగంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లోక్​సభ ఎన్నికల్లో సీటు షేరింగ్​పై మరింత పట్టు సాధించొచ్చు.

ఈ ఐదు రాష్ట్రాలను కలుపుకుంటే.. 83 లోక్​సభ సీట్లు ఉన్నాయి. 2018లో రాజస్థాన్​, ఛత్తీస్​గఢ్​, మధ్యప్రదేశ్​ ఎన్నికల్లో విజయం సాధించినా.. 2019 సార్వత్రిక సమరంలో కాంగ్రెస్​ పార్టీ డీలా పడింది. ఈసారి అలా జరగకూడదని.. ప్రజలను ఆకర్షించే పనిలో పడింది.

మరి ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్​ బలమైన ప్రదర్శన చేస్తుందా? లోక్​సభ సమరంలో బీజేపీకి గట్టిపోటీనిస్తుందా? ఇండియా బృందం మధ్య బంధం మరింత బలపడుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. ఎన్నికల ఫలితాలు వెలువడే డిసెంబర్​ 3 వరకు వేచి చూడాల్సిందే.

WhatsApp channel

సంబంధిత కథనం