Cong loses RS seat: ‘‘అయ్యో కాంగ్రెస్.. రాజ్యసభ ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా ఓడిపోయింది’’-cong loses rs seat in himachal despite majority bjp demands cms resignation ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cong Loses Rs Seat: ‘‘అయ్యో కాంగ్రెస్.. రాజ్యసభ ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా ఓడిపోయింది’’

Cong loses RS seat: ‘‘అయ్యో కాంగ్రెస్.. రాజ్యసభ ఎన్నికల్లో మెజారిటీ ఉన్నా ఓడిపోయింది’’

HT Telugu Desk HT Telugu
Feb 27, 2024 09:39 PM IST

Himachal RS elections: రాజ్య సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు షాక్ తగిలింది. హిమాచల్ ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కు గెలిచేందుకు అవసరమైన సీట్లు ఉన్నప్పటికీ.. ఇటీవల జరిగిన రాజ్య సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. మైనారిటీగా ఉన్న బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించాడు.

రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తున్న హిమచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు
రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేస్తున్న హిమచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు (ANI)

Himachal RS elections:కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒకటైన హిమాచల్ ప్రదేశ్ లోని ఏకైక రాజ్యసభ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ (BJP) కైవసం చేసుకుని, కాంగ్రెస్ కు ఊహించని షాక్ ఇచ్చింది. బీజేపీ మైనారిటీలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ (Congress) ను ఓడించింది. ఈ విజయంతో బీజేపీ ఉత్సాహంతో ఉంది. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత జైరాం ఠాకూర్ డిమాండ్ చేశారు.

మెజారిటీ ఉన్నా..

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మొత్తం 68 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ కు 40 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి 25 మంది సభ్యులున్నారు. ముగ్గురు స్వతంత్రులు కూడా కాంగ్రెస్ కు మద్ధతిస్తున్నారు. ఇలా, మెజారిటీ ఉన్నప్పటికీ, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ అగ్రనేత అభిషేక్ మను సింఘ్వీపై బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. ఇలా మంచి మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ రాజ్యసభ సీటును కోల్పోయింది.

మా ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారు..

కాగా, రాజ్య సభ ఎన్నికల నేపథ్యంలో.. తమ ఎమ్మెల్యేలు ఆరుగురిని సీఆర్పీఎఫ్, హరియాణా పోలీసులు కలిసి కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. తమ ఎమ్మెల్యేలను అపహరించి, ఓటు వేయకుండా చేసినందువల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని తెలిపింది. కాగా, రాజ్య సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత.. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు హర్యానా నుంచి హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాకు బయలుదేరారు.

మోదీ, షా విజయం

హిమాచల్ ప్రదేశ్ రాజ్య సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం నరేంద్ర మోదీ, అమిత్ షాల విజయమని ఈ ఎన్నికల్లో విజయం సాధించిన హర్ష్ మహాజన్ వ్యాఖ్యానించారు. అధికారంలో లేని హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ ఒక రాజ్యసభ సీటును గెలుచుకుందని, ఆ క్రెడిట్ జేపీ నడ్డా, అమిత్ షాలకు దక్కుతుందన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కన్నా ముందు బీజేపీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్ ఉన్నారు. ప్రస్తుతం హిమాచల్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో ఉందని విపక్ష నేత జైరాం ఠాకూర్ అన్నారు. మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం సుఖు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది వ్యవధిలోనే ఎమ్మెల్యేలు ఆయనను వదిలేశారని ఎద్దేవా చేశారు.