Condoms found in samosas: సమోసాల్లో కండోమ్స్, గుట్కా; ఐదుగురిపై కేసు నమోదు; విచారిస్తే కుట్ర కోణం-condoms gutka found in samosas supplied to firm 5 booked ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Condoms Found In Samosas: సమోసాల్లో కండోమ్స్, గుట్కా; ఐదుగురిపై కేసు నమోదు; విచారిస్తే కుట్ర కోణం

Condoms found in samosas: సమోసాల్లో కండోమ్స్, గుట్కా; ఐదుగురిపై కేసు నమోదు; విచారిస్తే కుట్ర కోణం

HT Telugu Desk HT Telugu
Apr 10, 2024 01:22 PM IST

Condoms found in samosas: ఒక సంస్థకు సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్ లు, గుట్కా కవర్లు కనిపించిన ఘటన పింప్రి-చించ్వాడ్ లో చోటు చేసుకుంది. ఆ సంస్థ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ సమోసాలు సరఫరా చేసిన వారిపై కేసు నమోదు చేశారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Condoms, gutka, stones found in samosas: మహారాష్ట్రలోని పింప్రి-చించ్వాడ్ లోని ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీకి సరఫరా చేసిన సమోసాల్లో కండోమ్ లు , గుట్కా, రాళ్లు కనిపించడంతో పింప్రి-చించ్వాడ్ పోలీసులు ఐదుగురిపై కేసు నమోదు చేశారు. నిందితులను ఎస్ ఆర్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రహీం షేక్, అజర్ షేక్, మజార్ షేక్, ఫిరోజ్ షేక్ అలియాస్ మంతు, విక్కీ షేక్ గా గుర్తించారు. సమోసాలు సరఫరా చేయమని అడిగిన సబ్ కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇద్దరు కార్మికులతో పాటు స్నాక్స్ లో కల్తీ చేసినందుకు గతంలో కాంట్రాక్టును రద్దు చేసుకున్న మరో సంస్థకు చెందిన ముగ్గురు భాగస్వాములపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఏం జరిగిందంటే..?

ఆ ఆటోమొబైల్ సంస్థకు చెందిన క్యాంటీన్ కు స్నాక్స్ అందించే బాధ్యత క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ది. అయితే, క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ స్నాక్స్ ను తయారు చేసే బాధ్యతను సబ్ కాంట్రాక్ట్ గా గతంలో ఎస్ ఆర్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ కు ఇచ్చింది. కానీ, వారు నాణ్యమైన స్నాక్స్ అందించడం లేదని ఆ కాంట్రాక్ట్ ను నిలిపివేసి, ఆ సబ్ కాంట్రాక్ట్ ను ఇటీవల మనోహర్ ఎంటర్ ప్రైజ్ అనే మరో సబ్ కాంట్రాక్ట్ సంస్థకు ఇచ్చింది. దాంతో, ఎస్ ఆర్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ ను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకుంది. తన కంపెనీలో పని చేసే ఇద్దరు వ్యక్తులను మనోహర్ ఎంటర్ ప్రైజ్ కు సమోసాలు తయారు చేసే పనికి పంపించింది. క్యాటలిస్ట్ సర్వీస్ సొల్యూషన్స్ కు పంపించే సమోసాల్లో చెత్తాచెదారం నింపాలని సూచించింది. దాంతో, వారు ఆ సమోసాల్లో కండోమ్స్, రాళ్లు, గుట్కా ప్యాకెట్లను నింపి ఆటోమెబైల్ సంస్థ క్యాంటీన్ కు పంపించారు. పోలీసులు నిందితులను విచారించగా ఈ వివరాలు వెల్లడయ్యాయి.

కేసు నమోదు

ఫిరోజ్ షేక్, విక్కీ షేక్ అనే ఇద్దరు ఉద్యోగులు సమోసాల్లో కండోమ్ లు, గుట్కా, రాళ్లను నింపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు ఉద్యోగులతో పాటు ఎస్ ఆర్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం పై పోలీసులు కేసు నమోదు చేశారు. వారిపై ఐపీసీ సెక్షన్ 328, సెక్షన్ 120బీ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మొదట్లో, ఎస్ ఆర్ ఎస్ ఎంటర్ ప్రైజెస్ యాజమాన్యం ఆ ఆటోమొబైల్ సంస్థకు పంపిన సమోసాల్లో ఫస్ట్ ఎయిడ్ బ్యాండేజ్ కనిపించడంతో వారిని కాంట్రాక్ట్ నుంచి తొలగించారు.

Whats_app_banner