Communal clashes in UK: ఆసియా కప్ లో భాగంగా ఆగస్ట్ 28న జరిగిన ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అనంతరం యూకేలోని లెస్టర్ పట్టణంలో హిందూ ముస్లిం వర్గాల మధ్య ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఇవి క్రమంగా తీవ్ర రూపం దాల్చాయి. ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. తాజాగా, మంగళవారం స్మెదక్ పట్టణంలోని దుర్గ భవన్ ఆలయం వెలుపల హింసాత్మక ఆందోళనలు జరిగాయి. స్పాన్ లేన్ లోని దుర్గా భవన్ ఆలయం వైపు పెద్ద ఎత్తున మతపరమైన నినాదాలు చేస్తూ గుంపుగా ప్రజలు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కొందరు ఆలయం గోడపైకి ఎక్కి, దాన్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో లెస్టర్ పట్టణంలోని హిందూ గ్రూప్ లపై, అక్కడి ఇస్కాన్ ఆలయ బాధ్యులపై బెదిరింపులు వచ్చాయన్న సోషల్ మీడియాలో పోస్ట్ లు వైరల్ అయ్యాయి. లెస్టర్ షైర్ లో ఆదివారం రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో హింసాత్మక దాడులు జరిగాయని పోలీసులు తెలిపారు. మొత్తంగా ఈ ఘర్షణలకు సంబంధించి 47 మందిని అరెస్ట్ చేశామన్నారు. యూకే లోని భారతీయులపై బెదిరింపులు, దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు లండన్ లోని భారతీయ హై కమిషనర్ ప్రకటించారు. ఈ దాడులు, బెదిరింపుల బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు, లెస్టర్ సిటీలోని హిందూ, ముస్లిం మత పెద్దలు మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు. ఘర్షణలకు అంతం పలికి, సంయమనంతో, సామరస్యంగా జీవనం కొనసాగించాలని నిర్ణయానికి వచ్చారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటను లెస్టర్ లోని ఇస్కాన్ దేవాలయం వెలుపల హిందూ, ముస్లిం మత పెద్దలు వెలువరించారు.