ట్రంప్ దెబ్బకు యూ టర్న్ తీసుకున్న కొలంబియా.. మీరు చెప్పే షరతులు ఓకే అంటూ ప్రకటన!
Donald trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో కొలంబియా తలొగ్గింది. గతంలో అక్రమ వలసదారులను అంగీకరించడానికి నిరాకరించిన కొలంబియా ఇప్పుడు ట్రంప్ షరతులన్నింటికీ ఓకే చెప్పింది. ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన తొలగిపోయిందని కొలంబియా విదేశాంగ మంత్రి తెలిపారు.
అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాయి. గతంలో ట్రంప్ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేసిన కొలంబియా ఇప్పుడు ట్రంప్ షరతులన్నింటినీ అంగీకరించేందుకు సిద్ధమైంది. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆర్థిక ఆంక్షలు ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఈ దక్షిణ అమెరికా దేశం యూ టర్న్ తీసుకుంది. అక్రమ వలసదారులకు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన అన్ని షరతులను అంగీకరించిందని వైట్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.
అధ్యక్షుడు ట్రంప్ షరతులకు కొలంబియా ప్రభుత్వం అంగీకరించిందని వైట్ హౌస్ తరఫున ప్రెస్ సెక్రటరీ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా నుంచి తిరిగి వచ్చిన అక్రమ వలసదారులందరినీ కొలంబియా అంగీకరించడం కూడా ఇందులో ప్రధానంగా ఉంటుంది.
కొలంబియా విదేశాంగ మంత్రి లూయిస్ గిల్బెర్టో కూడా ఈ అంశంపై ఒక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన అదుపులోకి వచ్చిందని చెప్పారు. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్న వలసదారులను కొలంబియా వెనక్కి తీసుకుంటుంది. కొలంబియాపై ఆర్థిక ఆంక్షలను రిజర్వ్‌లో ఉంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇదివరకే చెప్పారు. ఒప్పందాన్ని గౌరవించకపోతే దీనిని వాడుకుంటారు. కొలంబియా ప్రభుత్వ మద్దతుదారులు, పార్టీ సభ్యులందరికీ వీసాలను ట్రంప్ నిషేధించారు.
వాస్తవానికి అక్రమ వలసదారులతో వెళ్తున్న అమెరికా విమానాన్ని ల్యాండింగ్ చేయడానికి కొలంబియా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో అమెరికా, కొలంబియా మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. ఆగ్రహించిన ట్రంప్ అన్ని కొలంబియన్ వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ఆదివారం ప్రకటించారు.
కొలంబియా కూడా యునైటెడ్ స్టేట్స్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కలిగి ఉంది. అయితే అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు కొలంబియా ప్రభుత్వం నిరాకరించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. ఆ తర్వాత కొలంబియాపై సుంకం ప్రకటించారు ట్రంప్. అయితే ఆ తర్వాత ఈ ఆంక్షలను నిలిపివేశారు. మెుత్తానికి ట్రంప్ నిర్ణయంతో కొలంబియా దిగి వచ్చింది.