CLAT 2024: న్యాయవిద్యలో అడ్మిషన్లు; క్లాట్ 2024 సిలబస్, పరీక్ష విధానం.. వివరాలు
CLAT 2024: పలు ప్రముఖ జాతీయ న్యాయ విద్యా సంస్థలు, యూనివర్సిటీల్లో యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి క్లాట్ (CLAT) ను నిర్వహిస్తారు.
CLAT 2024: దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ నేషనల్ లా యూనివర్సిటీలు, ఇతర న్యాయ విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లా కోర్సుల్లో క్లాట్ (Common Law Admission Test -CLAT) ద్వారా అడ్మిషన్ల ను నిర్వహిస్తారు. 2024 విద్యా సంవత్సరానికి గానూ ఈ అడ్మిషన్ల కోసం క్లాట్ 2024 (CLAT 2024) ను ఈ సంవత్సరం డిసెంబర్ 3వ తేదీన నిర్వహించనున్నారు.
ఆఫ్ లైన్ లో..
క్లాట్ 2024 పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో డిసెంబర్ 3వ తేదీన జరుగుతుంది. ఈ పరీక్షను నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్షియం (Consortium of National Law Universities) నిర్వహిస్తుంది. తాజాగా, క్లాట్ 2024 (CLAT 2024) కు సంబంధించిన సిలబస్, పరీక్ష విధానం, తదితర విషయాలను ఈ కన్సార్షియం వెల్లడించింది.
UG CLAT 2024: యూజీ క్లాట్ 2024..
అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన యూజీ క్లాట్ 2024 (UG CLAT 2024) రెండడు గంటల పాటు జరుగుతుంది. అభ్యర్థులు రెండు గంటల్లో ఈ 120 ప్రశ్నలకు సమాధానాలను గుర్తించవలసి ఉంటుంది. అంటే, సగటున గంటకు 60 ప్రశ్నలకు, నిమిషానికి ఒక ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించవలసి ఉంటుంది. ప్రశ్నలు అన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో, మల్టిపుల్ చాయిస్ లతో ఉంటాయి. గత క్లాట్ పరీక్షల్లో 150 ప్రశ్నలు ఉండేవి. వాటి సంఖ్యను ఇప్పుడు 120 కి తగ్గించారు. ఈ 120 ప్రశ్నలు 5 సెక్షన్లుగా ఉంటాయి. అవి..
- ఆంగ్ల భాష
- జనరల్ నాలెడ్జ్‌తో సహా కరెంట్ అఫైర్స్
- లీగల్ రీజనింగ్
- లాజికల్ రీజనింగ్
- క్వాంటిటేటివ్ టెక్నిక్స్
- నెగటివ్ మార్క్ సిస్టమ్ ఉంటుంది.
- ఒక్కో తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. అంటే ప్రతీ నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్క్ కట్ అవుతుంది.
PG CLAT 2024: పీజీ క్లాట్ 2024..
పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన పీజీ క్లాట్ 2024 సిలబస్ లో కానీ, పరీక్ష విధానంలో కానీ ఎలాంటి మార్పులు చేయలేదని నేషనల్ లా యూనివర్సిటీల కన్సార్షియం ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్ ఈ కింది విధంగా ఉంటుంది. అలాగే, ఈ పరీక్ష విధానంలో నెగటివ్ మార్క్ సిస్టమ్ ఉంటుంది. ఒక్కో తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. అంటే ప్రతీ నాలుగు తప్పు సమాధానాలకు ఒక మార్క్ కట్ అవుతుంది.
- కాన్సిట్యూషనల్ లా
- జ్యూరిస్ ప్రుడెన్స్
- అడ్మినిస్ట్రేటివ్ లా
- లా ఆఫ్ కాంట్రాక్ట్స్
- టార్ట్స్, ఫ్యామిలీ లా, క్రిమినల్ లా
- ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా
- టాక్స్ లా, ఎన్విరాన్మెంటల్ లా
- లేబర్ అండ్ ఇండస్ట్రియల్ లా