యూట్యూబ్‌లో చూసి బాంబ్ తయారు చేసి- టీచర్ కుర్చీ కింద పెట్టి పేల్చిన విద్యార్థులు..
హరియాణాలోని ఓ స్కూల్లో కొందరు విద్యార్థులు టీచర్ కుర్చీ కింద బాణసంచా తరహా బాంబు పెట్టి పేల్చారు! ఆ బాంబును యూట్యూబ్‌లో చూసి తయారు చేశారు.
హరియాణాలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సర్వత్రా చర్చకు దారితీసింది! యూట్యూబ్‌లో చూసి బాణసంచా తరహా బాంబు తయారు చేసిన ఓ విద్యార్థులు, దాన్ని టీచర్ కుర్చీ కింద పెట్టి పేల్చారు! ఈ ఘటనలో అదృష్టవశాత్తు టీచర్‌కి ఎలాంటి గాయాల కాకపోవడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ జరిగింది..
చిలిపితనంలో భాగంగా సైన్స్ టీచర్ కుర్చీ కింద బాణసంచా లాంటి బాంబును పేల్చిన 12వ తరగతి విద్యార్థులను పాఠశాల నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. విద్యార్థులు యూట్యూబ్ సహాయంతో పేలుడు పదార్థాలు తయారు చేయడం నేర్చుకున్నట్లు సమాచారం.
సంబంధిత టీచర్ విద్యార్థులను మందలించినట్టు సమాచారం! ఫలితంగా విద్యార్థుల బృందం ఎదురుదాడి చేయాలని ఈ విధంగా ప్లాన్ చేయడంతో ఈ ఇబ్బందికర సంఘటన చోటు చేసుకుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. టీచర్ కుర్చీ కింద బాణసంచా తరహా బాంబును !ఒక విద్యార్థి ఉంచగా, మరొకరు రిమోట్ కంట్రోల్ ఉపయోగించి దాన్ని పేల్చారు.
యూట్యూబ్‌లో బాంబు లాంటి టపాసులు తయారు చేయడం నేర్చుకుని రిమోట్ కంట్రోల్ సహాయంతో దాన్ని ఆపరేట్ చేసినట్లు సమాచారం.
దీనిపై స్పందించిన హరియాణా విద్యాశాఖ ఈ ప్రమాదకరమైన చిలిపి చేష్టలకు పాల్పడిన 13 మంది విద్యార్థులను వారం రోజుల పాటు సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ భయానక ఘటన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు వెంటనే పాఠశాలను సందర్శించి సమగ్ర దర్యాప్తు చేపట్టారు.
పిల్లలను పాఠశాల నుంచి బహిష్కరించే విషయమై చర్చలు జరిగాయని, అయితే తల్లిదండ్రులు క్షమాపణలు చెప్పి, భవిష్యత్తులో విద్యార్థులు ఈ విధంగా వ్యవహరించబోరని హామీ ఇచ్చారని సమాచారం.
ఈ ఘటన అనంతరం విద్యార్థుల దుశ్చర్యలపై చర్చించేందుకు గ్రామంలో పంచాయితీని కూడా ఏర్పాటు చేశారు.
క్లాసులో ఉన్న 15 మంది విద్యార్థుల్లో 13 మందికి ఈ విషయం తెలుసని పంచాయితీలో తేలింది. విద్యార్థులందరినీ వారం రోజుల పాటు సస్పెండ్ చేయగా, వారిపై అదనపు చర్యలు తీసుకుంటారా? అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
అయితే విద్యార్థులను సంబంధిత టీచర్ క్షమించినట్టు జిల్లా విద్యాధికారి నరేష్ మెహతా తెలిపారు.
“ఈ పిల్లలు ఒక నమూనాను తయారు చేసి సమర్పించి ఉంటే, మేము వారిని గౌరవించేవాళ్లం. కానీ ఇప్పుడు ఈ విషయంపై హెచ్చరికలు చేయాల్సి వచ్చింది. ఈ పిల్లలు ఇదంతా యూట్యూబ్ నుంచి నేర్చుకున్నారు,” అని మెహతా వ్యాఖ్యానించారు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లలు చేసిన పని గురించి తెలిసి అందరు షాక్‌కు గురయ్యారు.
సంబంధిత కథనం